వీధిరౌడీల్లా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల వైఖరి

ఫలించని తెలుగుదేశం పార్టీ డ్రామాలు
చైర్మన్‌ ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను

జగ్గయ్యపేట: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యలు వీధి రౌడీల్లా వ్యవహరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను ధ్వజమెత్తారు. చట్టాలను పాటించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు జగ్గయ్యపేట మున్సిపల్‌ ఎన్నికల అధికారిపై దౌర్జన్యం ప్రవర్తించారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక అనంతరం సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ఎన్నికను ఏదోరకంగా వాయిదా వేయాలనే కుట్రతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని క్రమశిక్షణగా ఉన్నామన్నారు. సుమారు అరగంట పాటు ఎన్నికల అధికారిని నిలబెట్టి ఎన్నికను వాయిదా వేయాలని ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యం చేశారని, అయినా ఆయన సహనంతో ఉన్నారన్నారు. టీడీపీ నేతల ఆగడాలపై జిల్లా కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. 

రౌడీయిజంతో గెలవలేరని తెలుసుకో బాబూ!

చైర్మన్‌ పదవిని దక్కించుకునే బలంలేకపోవడంతో టీడీపీ సభ్యులను వైయస్‌ఆర్‌ సీపీ నేతలు కడ్నాప్‌ చేశారంటూ కొత్త హైడ్రామాకు తెరలేపారని సామినేని ఉదయభాను మండిపడ్డారు. 16 మంది మెజార్టీ సభ్యులుండగా టీడీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేంద్రంలో రాష్ట్రంలో మా ప్రభుత్వాలే ఉన్నాయన్న అహంకారంతో ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి వైయస్‌ఆర్‌ సీపీ కౌన్సిలర్లను ఏదోరకంగా ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. అయినా టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు తలొగ్గకుండా సభ్యులు క్రమశిక్షణతో ఉన్నారన్నారు. ఉన్న మెజార్టీతో చైర్మన్‌ పదవిని సొంతం చేసుకున్నామన్నారు. చైర్మన్‌ ఎన్నికకు సహకరించిన అధికారికి, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రౌడీయిజం ద్వారా విజయం సాధించాలనుకుంటే పొరబాటని, ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు.  
Back to Top