బండారం బయటపడుతుందని అధికారపార్టీ నేతల భయం

అమరావతి: అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పదినిమిషాలు వాయిదా అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సభముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే... తన ప్రయత్నాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సభలో పుల్లారావు భూముల కొనుగోలుపై తాను ఆధారాలు ప్రవేశపెట్టాక, తర్వాత వాళ్ల దగ్గర గొప్ప ఆధారాలుంటే సభలో ఇవ్వొచ్చన్నారు. ఇద్దరి వాదనలు విన్నాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అయితే ఆ అవకాశాన్ని స్పీకర్‌ తమకు ఇవ్వడం లేదన్నారు.

నీటి కుళాయిల దగ్గర సవాళ్ల మాదిరిగా విసురుతున్న సవాళ్లకు అర్థం లేదన్నారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్‌కు ప్రభుత్వం పారిపోయిందని వైయస్‌ జగన్‌ అన్నారు. తనపై కేసులకు సంబంధించి విసిరిన సవాల్‌కు ప్రభుత్వం నోరు విప్పలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు బయటకు వస్తే మంత్రి పుల్లారావు సహా అధికార పార్టీ నేతల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తే మైక్‌ కట్‌ చేస్తున్నారన్నారు. సభను ముందుకు తీసుకెళ్లాల్సిన స్పీకర్‌ ఆ పని చేయడం లేదని, సభ విలువలను, గౌరవాన్ని దిగజార్చుతున్నారని వైయస్‌ జగన్‌ అన్నారు.

Back to Top