దళిత కుటుంబంపై ‘దేశం’ నేతల దాడి

– మంచినీళ్లు అడిగితే చితక్కొట్టారు
– ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల రాస్తారోకో

గుంతకల్లు:తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకు పెట్రేగి పోతున్నాయి. అధికార మదంతో అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మంచినీళ్లు అడిగిన పాపానికి ఒక దళిత కుటుంబంపై సోమవారం రాత్రి దాడికి తెగపడ్డారు. మంది, మార్బలంతో దేశం సర్పంచ్‌ చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బాధితులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వైటి చెరువు గ్రామంలో దళితవాడకు గత పది రోజులుగా మంచినీటి సరఫరా కావడం లేదు. దళితవాడలో దేశంకు అనుకూలంగా ఉన్న వారి ఇళ్ల వద్ద మాత్రమే మంచినీటి కొళాయిలు వేయించి మిగిలిన వారి పట్ల రాజకీయ వివక్ష చూపుతూ మంచినీటి సరఫరాను అడ్డుకుంటున్నారు. దీంతో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దళితులు కనీస అవసరాలకు నీరు లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే దళితవాడకు చెందిన జే.రమేష్‌ నీటి ఇక్కట్ల గురించి గ్రామ సర్పంచ్‌ సుశీలమ్మ కుమారులు రంగస్వామి, రాణాలకు వెలిబుచ్చారు. నీళ్లు సంవృద్ధిగా ఉన్నా దళితవాడలో కొన్ని ప్రాంతాలకు ఉద్దేశ్యపూర్వకంగా నీటి సరఫరా నిలిపి వేస్తున్నారని ఆరోపించారు. ఉగాదికి ఎలాగో ఇవ్వలేదు కనీసం శ్రీరామనవమి పండుగకు నీరివ్వాలని కోరారు. ఇది జీర్ణించుకోలేని సర్పంచ్‌ కుమారులు రంగస్వామి, రాణాలు తనతో (రమేష్‌) వాగ్వాదంకు దిగారన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్‌ సుశీలమ్మకు వివరించి మంది మార్బలంతో నా (రమేష్‌) కుటుంబంపై దాడికి దిగారని ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారని వాపోయాడు. దీనిపై దళితులు ప్రశ్నిస్తే సహించమని హెచ్చరించారు. తీవ్ర గాయాలతో రమేష్, సాలక్కలు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి చేరారు. ఈ విషయమై రూరల్‌ పోలీసులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాస్తారోకో
వైటి చెరువు దళితవాడ నివాసి రమేష్‌పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్, ప్రగతి శీల ప్రాథమిక సమాఖ్య, పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. 
Back to Top