అవాస్తవాలు మాట్లాడటం టీడీపీ నేతలకు అలవాటే

నెల్లూరు:  తెలుగు దేశం పార్టీ  నాయకులకు అవాస్తవాలు మాట్లాడటం అలవాటేనని  వైయస్‌ఆర్‌సీపీ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని వింజమూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ సోమిరెడ్డి మేకపాటి సోదరులపై చేసిన వ్యాఖ్యలను చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా ఖండించారు. మేము  అభివృద్ధికోసమే పాటు పడ్డామన్నారు. ఇంతవరకు జిల్లాలో బీదా కుటుంబానికి మంచి పేరుందని, మాకు ఆ కుటుంబమంటే గౌరవప్రదమైన భావన ఉండేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఎవరు ఎలాంటివారో తెలుసుకోవాలంటే ఉదయగిరిలోని పల్లెపల్లె తిరిగి ప్రజలమధ్యే కూర్చుంటే అర్థమవుతుందన్నారు. ఎవరు మంచో..ఎవరు చెడో ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందామని, దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. నోరుంది కదాని వక్రీకరించి మాట్లాడటం తగదన్నారు. నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలమధ్యే ఉండి వారి సాధకబాధకాలను స్వయంగా తెలుసుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెవలలేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి పొంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సోమిరెడ్డికి హితవు పలికారు. 

ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఫైబర్‌ చెక్‌డ్యాలం పేరుతో బినామీ కాంట్రాక్టులు పొంది కమీషన్లు తీసుకుంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరు మీ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలను టార్గెట్‌ చేసుకొని తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం నిజం కాదా అని నిలదీశారు. నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో మీ పార్టీ నేతలే కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు. నోరుంది కదాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్దిచెబుతారని బీద, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను హెచ్చరించారు.  ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గణపం బాలక్రిష్ణారెడ్డి, మలిరెడ్డి విజయకుమార్‌రెడ్డి, చేజర్ల భాస్కర్‌రెడ్డి, మద్దూరు లక్ష్మినరసారెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, హజరత్‌రెడ్డి, ముక్కమల్ల శ్రీనివాసులురెడ్డి, తదితరులున్నారు. 
Back to Top