టీడీపీ నేతల అరాచకాలు

– గుంటూరు జిల్లాలో ఎన్నికల అధికారి నిర్బంధం
–పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీపీ ఎన్నికకు అడ్డంకులు
గుంటూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని పచ్చతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చేందుకు అరాచకాలు సృష్టిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. ఎన్నికల అధికారి కృష్ణదేవరాయను నిర్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైయస్‌ఆర్‌సీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఉపాధ్యక్ష పదవి వైయస్‌ఆర్‌సీపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో ఎలాగైనా ఈ ఎన్నికను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు ఏకంగా ఎన్నికల అధికారిని నిర్బంధించి  దౌర్జన్యానికి పాల్పడ్డారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండల ఎంపీపీ ఎన్నికను కూడా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎంపీటీసీలను ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ నేతలు నిర్భందించడంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
Back to Top