రైతుల భూములు కొట్టేయడానికి ప్రభుత్వం కుట్ర

విశాఖపట్నం: విశాఖలో ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో ప్రభుత్వం పేదరైతుల భూములను కొట్టేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మండిపడ్డారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపు నుంచి నన్ను పంపించారని ముగపాకకు చెందిన 286 మంది రైతులను ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో ఓ కుట్రదారుడు మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో, లోకేష్‌తో తీసుకున్న ఫోటోలు చూపించి డీపట్టా భూములను లాక్కోవడానికి జలవిహార్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నడింపల్లి వెంకట రామరాజు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతుల పొలాల్లో ఉన్న చెట్లు కూడా తీసిసే కిలో మీటర్ల మేర రహదారులు నిర్మించుకున్నాడని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరుపున వచ్చానని చెప్పి రైతులను భయబ్రాంతులకు గురిచేసి అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశాడని దుయ్యబట్టారు. మోసపోయిన రైతులు కమీషనర్‌ యోగానంద్‌ను కలిసి ఫిర్యాదు చేసినా  ఇప్పటి వరకు పోలీసులు వెంకటరామరాజుపై చర్యలు తీసుకోలేదని అన్నారు.  చంద్రబాబు కుమారుడు లోకేష్‌తో కుమ్మకైన వ్యక్తి రైతుల భూములను అన్యాయంగా లాక్కున్నా పోలీసులు విచారణ కూడా జరపలేదన్నారు. దీని వెనుక ఎంతమంది హస్తం ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నడింపల్లి వెంకట రామరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top