మహానగరాల్లో మాయగాళ్ల భూ కబ్జాలు

  • టీడీపీ సర్కార్ భూ దురాక్రమణలు
  • లక్షలాది ఎకరాలు కొల్లగొడుతున్న తమ్ముళ్లు
  • పెదబాబు, చినబాబు కనుసన్నల్లో భూ మాఫియా
  • భూ దందాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
  • ప్రజలు అధికారమిచ్చింది దోచుకునేందుకేనా బాబూ..?
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజం
విజయవాడః మహానగరాల్లో మాయగాళ్లను సృష్టించి చంద్రబాబు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ప్రజలు నీకు అధికారం కట్టబెట్టింది మహానగరాలను దోచుకునేందుకేనా బాబు అని రమేష్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి మహానగరాల్లో చినబాబు, పెదబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు టీడీపీ నేతలంతా ట్యాంపరింగ్ చేసి మరీ లక్షలాది ఎకరాలు ధారాదత్తం చేసుకుంటున్నారని జోగి రమేష్ విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు. టీడీపీ నేతల భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లోని మియాపూర్ లో ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ  దీపక్ రెడ్డి దందాలు, దౌర్జన్యాలు, భూ దురాక్రమణలు చేస్తూ చినబాబు, పెదబాబులకు పెట్టుబడి, పెత్తందారులుగా పనిచేస్తున్నారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. దీపక్ రెడ్డికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో సంబంధాలున్నాయని, వీళ్లంతా చంద్రబాబు అనుచరులేనని రమేష్ అన్నారు. తెలుగుదేశం మాయగాళ్లు విశాఖలో చేరి వేలాది ఎకరాలు దోచుకున్నారని రమేష్ అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం నీతి, నిజాయితీ  ఉన్నా భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలన్నారు.  ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే మహానగరాల్లో భూమాఫియా జరుగుతోందని రమేష్ పేర్కొన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు మాయగాళ్ల అవతారం ఎత్తి భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు.  

వైయస్సార్సీపీ ఎప్పటినుంచో విశాఖలో భూ దోపిడీ జరుగుతోందని చెబుతోందని,  భూ కబ్జాలు జరిగింది వాస్తవం అని స్వయంగా మీ మంత్రి అయ్యన్నపాత్రుడే ఒప్పుకున్నాడన్నారు. అయన్నపాత్రుడు మాటకైనా గౌరవించి సీబీఐ ఎంక్వైరీ వేయించాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.  ఈ భూదందాలో ముఖ్యమంత్రి పాత్ర ఏంటనేది బయటకు తెలియాలన్నారు.  నిజాలు నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ముఖ్యమంత్రిపై ఉందని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బాబును హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అంటూ  స్క్వేర్ ఫీట్ రు.  10వేలు వెచ్చించి తాత్కాలిక అసెంబ్లీని కట్టించి... మూడునెలల్లోనే దాన్ని మురికికూపాలుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ?ఎవరబ్బ సొమ్ము బాబు...? ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారని జోగి రమేష్ తూర్పారబట్టారు.  
Back to Top