'జగన్‌కు వచ్చిన ఆదరణ సహించలేకనే విమర్శలు'

అనంతపురం: ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షకు రైతులు, మహిళలు వేలాదిగా తరలివచ్చారని ఆ పార్టీ నాయకులు అన్నారు.  జగన్‌పై ప్రజలు చూపుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తణుకులో జగన్ దీక్షకు రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇది చూసి టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందని, అందుకే మతిభ్రమించినట్ల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లాలో మంత్రుల ముసుగులో అక్రమ వసూళ్లు, భూకబ్జాలు, ఇసుక మాఫియా చెలరేగిపోతోందన్నారు. ఇప్పటికే టీడీపీ మంత్రులు, శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులుతమ అధినేతను రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేసేలా ఒప్పించాలని సూచించారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Back to Top