ప్రజాసమస్యలు పట్టవా.?

అనంతపురం న్యూసిటీ: ‘వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం విన్నవించాం. దాదాపుగా 60 పోల్స్‌ఉంటే ఒక్కదానికి లైటు లేదు. ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి. ఎల్‌ఈడీ వెలుగులంటూ ప్రచారం చేశారు. కానీ ఆచరణ శూన్యం. ప్రజా సమస్యలు పట్టవా..?అని’ వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ జానకి డీసీ జ్యోతిలక్ష్మిని ప్రశ్నించారు. సోమవారం నగరపాలక సంస్థలో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్‌ జానకి గంటసేపు వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని అక్కడే బైఠాయించారు. చివరకు డీసీ మంత్రి ఓఎస్‌డీ ఖాజాతో మాట్లాడారు. త్వరలో లైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో కార్పొరేటర్‌ శాంతించారు. వారం రోజుల్లో లైట్లు ఏర్పాటు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.   

Back to Top