మిర్చి రైతుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం

కోల్డ్ స్టోరేజీల్లో రైతులకు అవకాశమివ్వాలి
ఒంగోలు క‌లెక్ట‌రేట్ ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో రైతుల ధ‌ర్నా
ప్ర‌కాశం:  మిర్చి రైతుల‌ను ఆదుకోవ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మండిప‌డ్డారు. 
 అటు ప్రభుత్వం, ఇటు వ్యాపారులు కలిసి మిరప రైతులను కష్టాల ఊబిలోకి నెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు. మిర్చి రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం ఒంగోలు క‌లెక్ట‌రేట్ ఎదుట రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుత ధరలతో పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు విలవిల్లాడుతున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అప్పుల ఊబిల్లో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారన్నారు. పోనీ గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట దాచుకుందామనుకుంటే ఉన్న కోల్డ్‌ స్టోరేజీలను సైతం గుంటూరు జిల్లా వ్యాపారులు వశం చేసుకున్నారని విమ‌ర్శించారు. దీంతో  రైతులు మిరప పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 52 కోల్డ్‌ స్టోరేజీలున్నాయి. అయితే గుంటూరు ప్రాంతానికి చెందిన మిర్చి వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజీలను గుత్తమొత్తంగా తీసేసుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్యాపారులు తక్కువ ధరకు రైతుల వద్ద మిర్చిని కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో స్టాకు పెట్టేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు మిర్చిని దాచుకోవాలనుకున్న జిల్లా రైతులకు ఇది అడ్డంకిగా మారింద‌న్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌శాకం జిల్లావ్యాప్తంగా లక్షా 50వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారని,. పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సగటున 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వచ్చింద‌న్నారు. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా రూ.18 వేలు ఉండగా, తేజా రకం మిర్చి రూ.13 వేల వరకు ఉంద‌న్నారు. ప్రస్తుతం బేడిగ రకం రూ.7 వేల లోపు ఉండగా తేజా రకం రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే ఉంద‌ని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మిర్చి అమ్మకానికి పెడితే రైతులకు పంట కోత కూలీలు కూడా వచ్చే పరిస్థితుల్లేవు అన్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో వ్యాపారులకు కాకుండా రైతులకు అవకాశమివ్వాల‌ని డిమాండ్ చేశారు.
Back to Top