రైతుల‌ను మోసం చేసిన టీడీపీ స‌ర్కార్‌

నంబులపూలకుంట (అనంత‌పురం): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌కుండా మోసం చేశార‌ని, ముఖ్యంగా రైతులకు రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి చేయ‌కుండా మోసం చేయ‌డం దారుణ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి రాఘ‌వ‌య్య‌, డీసీఎంఎస్ డైరెక్ట‌ర్ టి.జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డిలు ఆరోపించారు. బుధ‌వారం మండల కేంద్రంలోని మ‌ల్లిఖార్జున రైస్‌ మిల్లు వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీనే రైతుల ఖాతాలల్లో రుణమాఫీ సొమ్మును జ‌మ‌చేశామంటూ ప్ర‌క‌టనలు చేసి 20రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా రుణమాఫీ లెక్క రూపాయి తీసుకోలేదన్నారు. పంటసాగు సమయంలో భీమా కింద రైతుల నుంచి ప్రీమియంను వసూలు చేసినప్పటికీ పంటనష్టపరిహారాన్ని మాత్రం అందజేయడంలో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జాబితాలో పేరున్న రైతుల ఖాతాలను తారు మారు చేసి నిజమైన రైతులకు పరిహారం అందకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ రైతులను భిక్షగాళ్లగా మార్చిన ఘణత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన సోలార్‌హబ్‌ వలన భూములు పోగుట్టు కొన్న రైతులకు పరిహారం రాక బెంగుళూరుకు వెల్లి కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాసుపల్లి భూములను పచ్చని పంటపొలాలతో కళకళలాడేలా చూడాలని ఉద్దేశ్యంతో చేపట్టిన హంద్రీనీవా కాలువ నిర్మాణం పూర్తి అయినే కల్గే ప్రయోజనం శూన్యమన్నారు. భూములు కోల్పోయిన రైతులందరికీ 2013భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందజేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు.

Back to Top