రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశపర్చిన బడ్జెట్ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసంబడ్జెట్ లో నిధులు కేటాయింపులో మోసంఅన్ని వర్గాల ప్రజలను మోసగించిన టీడీపీ
టీడీపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశపర్చింది. తొలుత మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగ పాఠం మొదలు నిధుల కేటాయింపువరకు అంతా మోసపూరిత విధానాన్నే అవలంభించారని ప్రతిపక్షాలు, మేధావులు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఎన్నికల హామీల మాదిరే ఏపీ సర్కార్ మరోసారి బడ్జెట్ పేరుతో ప్రజలను నయవంచనకు గురిచేస్తోందని దుయ్యబడుతున్నారు. ప్రజలు బడ్జెట్ ను విమర్శిస్తారన్న భయంతోనే యనమల ఇంగ్లీష్ లో చదివారని చురక అంటించారు.
ఎన్నికల సమయంలో వందలాది వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు...తీరా పీఠం దక్కాక వాటిని తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసగించారు. అదే సీన్ మళ్లీ రిపీట్ చేస్తున్నారు. 2016-17 బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపించారు. యనమల బడ్జెట్ అంతా మాటల మూటలు..అంకెల గారడీగానే ఉంది తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా లేదని మేధావులు అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ లో పేజీలు పెరిగాయి తప్ప ఎక్కడ కూడా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెరగలేదు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలను తీవ్ర నిరాశ పర్చారు. అధికారంలోకి వస్తే బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని డంబాలు పలికిన టీడీపీ...పదవి దక్కాక వడ్డీలకు సరిపడా రుణాలు కూడా మాఫీ చేయలేదు. ఎలాంటి రుణమాఫీ చేయకుండానే అన్నీ చేశామని చెప్పుకుంటూ రైతులను నిండా ముంచేస్తున్నారు. దానిలో భాగంగానే బడ్జెట్ లో రైతులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు.
జాబు రావాలంటే బాబు రావాలంటూ ...ఎన్నికల ముందు టీవీల్లో, పత్రికల్లో గొప్పగా ప్రకటనలు గుప్పించారు. గోడల మీద రాతలు రాయించారు. బాబు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జాబు బాబు అంటూ ఊదరగొట్టారు. అంతేకాదు ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చెప్పారు. కానీ, అధికారం చేపట్టాక ఉద్యోగాలు ఇవ్వడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తీసేశారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్క అటెండర్ పోస్ట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇక నిరుద్యోగల ఊసేలేదు. బడ్జెట్ లోనూ నిరుద్యోగలకు పైసా విదిల్చకుండా మరోసారి మంగళం పాడారు.
చేనేత కార్మికులకు రూ. వేయి కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామనే హామీని విస్మరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు బడ్జెట్ లో రూ. వేయి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచారు. అంతేకాదు డ్వాక్రా మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి...వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, బడుగు బలహీన వర్గాలకు అత్తెసరు నిధులతో సరిపెట్టి మమ అనిపించారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులనే ఖర్చుచేయని ప్రభుత్వం...ఇప్పుడు కొత్తగా కేటాయించిందేమీ లేదని, బడ్జెట్ నిధులను మరోసారి నొక్కేసే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.