టీడీపీలో ఆందోళన... వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం

ప్రతిపక్ష నేత రెండు రోజుల దీక్షతో విపక్షంలో నూతనోత్తేజం
టీడీపీని గెలిపించిన ‘పశ్చిమ’లో వై.ఎస్.జగన్ దీక్షకు పెద్దగా ప్రజాస్పందన ఉండదన్న అధికార పార్టీ అంచనాలు తల్లకిందులు జగన్ దీక్ష విజయవంతమైందంటూ సర్కారుకు ‘నిఘా’ నివేదిక!


విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను మాఫీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన రైతు దీక్ష ప్రజలను ఆలోచింపచేసింది. పార్టీ శ్రేణల్లో నూతనోత్సాహం నింపింది.

చంద్రబాబు ఎన్నికల సమయంలో రైతు రుణాలు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లు పూర్తిగా నమ్మారు.  అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వేదిక మీద నుంచే తొలి సంతకం పేరుతో కోటయ్య కమిటీని నియమించడంతోనే బాబు తన హామీల అమలుకు కత్తెర వేస్తున్నారనే విషయాన్ని జనం పసిగట్టారు. అనేక షరతుల అనంతరం కుటుంబానికి లక్షన్నర రూపాయలైనా రుణ మాఫీ జరుగుతుందని భావించినా అది కూడా మరో నాలుగేళ్ల తర్వాత కూడా పూర్తిగా అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

డ్వాక్రా మహిళలదీ ఇదే పరిస్థితి. బాబును ఎంతగానో నమ్మి ఆయన చేతిలో నిట్టనిలువునా మోసపోయిన పశ్చిమగోదావరి జిల్లానే వేదికగా చేసుకుని వైఎస్ జగన్ దీక్షకు దిగాలని నిర్ణయించారు. తణుకులో రెండు రోజుల దీక్ష అని తొలుత ప్రకటించిన సమయంలో ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ఈ జిల్లాలో జగన్ దీక్షకు పెద్దగా స్పందన ఉండదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేశాయి. బాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంపై జనంలో మొదలైన అసంతృప్తి, ఆగ్రహం ఈ దీక్ష ద్వారా ఖచ్చితంగా వ్యక్తమవుతుందని వైఎస్సార్ సీపీ శ్రేణులు భావించాయి.

రెండు రోజులూ జన నీరాజనం...
జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రారంభించిన శనివారం ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరం జనంతో కిక్కిరిసింది.  డ్వాక్రా మహిళలు వేలాది మంది తరలివచ్చి ఆయన కోసం గంటల తరబడి ఓపిగ్గా ఎదురు చూశారు. అంచనాలకు మించి జనం స్వచ్ఛందంగా తరలి రావడం అటు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన రేకెత్తించగా.. ఇటు వైఎస్సార్ సీపీ నేతలకు ఆనందం కలిగించింది. చంద్రబాబు మోసాలను ఇదే వేదిక మీద నుంచి జనానికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ పార్టీ నేతలు తమ ప్రసంగాలు సాగించారు. రెండో రోజు ఆదివారం కూడా జన స్పందన ఇదేలా కొనసాగడంతో పాటు, జగన్ ప్రసంగం ప్రారంభించే సమయానికి స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు దీక్షా స్థలికి పోటెత్తారు.

ఆలోచింపచేసిన ప్రసంగం...
దీక్ష ముగించిన అనంతరం వై.ఎస్.జగన్ చేసిన ప్రసంగం ఏ రాజకీయ పార్టీకి చెందని ప్రజలతో పాటు, టీడీపీ సానుభూతిపరులను కూడా ఆలోచింప చేసింది. రైతులు, డ్వాక్రా రుణ మాఫీల గురించి చదువు రాని వారికి కూడా బాగా అర్థమయ్యే రీతిలో జగన్ వివరించడంతో జనానికి బాగా అర్థమయ్యాయి.  ఈ దీక్ష భవిష్యత్తులో జరిగే మరింత గట్టి పోరాటాలకు బీజం వేసిందనీ, వైఎస్సార్ సీపీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందని టీడీపీ వర్గాలు అంచనాకు వచ్చాయి.

ఇంటెలిజెన్స్ నివేదిల్లోనూ సక్సెస్...
జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల దీక్ష ఊహించనంత విజయవంతం అయ్యిందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. రెండు రోజులు జనం భారీగానే వచ్చారనీ, జగన్ ప్రసంగం జనాన్ని ఆలోచింపచేసే రీతిలో సాగిందని ఆ వర్గాలు వివరించినట్లు సమాచారం.

తాజా ఫోటోలు

Back to Top