వైయస్సార్సీపీ లో తెలుగుదేశం కార్యకర్తల చేరిక

యర్రగొండపాలెం:ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన పుల్లలచెరువు
మండలంలోని నాయుడుపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు
ఎమ్మెల్యే సురేష్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి.వైఎస్సార్‌ సీపీ నాయకుడు ఆకుల కోటిరెడ్డి ఆధ్వర్యంలో
నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల శ్రీనివాసరెడ్డి
అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ
నాయకులు అధికారులను బెదిరిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
రెండేళ్ల టీడీపీ పాలనలో ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదని, కేవలం మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం
రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని సురేష్‌ ధ్వజమెత్తారు. నారా
చంద్రబాబునాయుడు పదేళ్లు సీఎంగా, మరో
పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని, దేశంలోనే
తనంతటి మనిషి లేడని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.అధికారం కోసం ఎన్నికల సమయంలో అలివికాని వాగ్దానాలు చేసి, ఒక్కటి కూడా నెరవేర్చిన పాపానపోలేదని దుయ్యబట్టారు. రాష్టానికి
అన్యాయం జరిగింది వాస్తవమేనని, అయితే సీఎం
కేంద్రం నుంచి ఒక్క రూపాయి గ్రాంటు తీసుకుని రాలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం
కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టి ప్రధాన జీవనాధారమైన వెలిగొండ
ప్రాజెక్టుకు నీరు రాకుండా చేస్తుంటే సీఎం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు.
ఓటుకు కోట్లు కేసు భయంతోనే సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంను జలాలపై
నిలదీయలేకపోతున్నారన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదర్శ
ముఖ్యమంత్రిగా దివంగతనేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిలిచారని, అటువంటి రామరాజ్యం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు
కోరుకుంటున్నారన్నారు. 2018లో ఎన్నికల
గంట మోగుతుందని, ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ
అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అఖండ మెజార్టీ సాధించి సీఎం అవుతారని ప్రజల
హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నమ్మించి మోసం చేసినవారికి అండగా ఉండబోమని
నాయుడుపాలెం గ్రామానికి చెందిన ప్రజలు నిక్కచ్చిగా చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు
వేయడం శుభపరిణామమన్నారు.

 

Back to Top