టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన

  • ఓటర్లకు ఇళ్లు కట్టిస్తామంటూ చంద్రబాబు ప్రలోభాలు
  • కోడ్‌ ఉల్లంఘన కింద చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీదే గెలుపు
  • వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఆకేపాటి,  కొరుముట్ల, రవీంద్రనాథ్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా:  సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఉద్యోగులతో మీటింగ్‌లు పెట్టి ఇళ్లు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఏకంగా టీచర్స్‌తో సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ చేస్తున్న అరాచకాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రవీంద్రనా«ద్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన మంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా నిలబడిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం దారుణమన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీస మెజార్టీ లేనప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి దిగడం అనైతికం అని దుయ్యబట్టారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల ప్రచారం చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు వైయస్‌ వివేకానందరెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డిలు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. 

ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన సీఎం చంద్రబాబుపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు ఓటర్లను ఆకట్టుకునే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. టీచర్‌లకు ఇళ్లు కట్టిస్తాం... అమరావతిలో స్థలాలు ఇస్తాం అంటూ మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే ఒక్కటి నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు టీచర్స్‌పై కొత్త ప్రేమ వలకబోస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించినంత మాత్రాన తన వెంటే ప్రజలంతా ఉన్నారని ఆదినారాయణరెడ్డి అనుకోవడం మూర్ఖత్వం అన్నారు. జమ్మలమడుగు ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలే ఆదినారాయణరెడ్డికి తగిన బుద్ధిచెబుతాయని చురకంటించారు. జరగబోయే ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతుందని స్పష్టం చేశారు. మోసపూరిత వాగ్ధానాలతో అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

Back to Top