ఓటమి భయంతో రూ.200 కోట్లు పంచారు

  • వైయస్‌ఆర్‌ సీపీ అంటే చంద్రబాబుకు భయం
  • దొడ్డిదారిన విజయం సాధించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు
  • దమ్ముంటే 20మందితో రాజీనామా చేయించాలని సవాల్‌
  • వైయస్‌ఆర్‌ సీపీతో పోటీపడి డిపాజిట్లు సాధించుకోలేని నీచ చరిత్ర టీడీపీది
  • 2019లో ఓటర్లను బెదిరించడమేనా మీ మోడల్‌
  • ధైర్యంగా ఓటేసిన 70 వేల ఓటర్లకు హ్యాట్సాఫ్‌
  • నంద్యాలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే భరతం పడతాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
హైదరాబాద్‌: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి రూ. 200 కోట్లు ఖర్చు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనట్లుగా దాదాపు రూ.12 వందల కోట్ల అభివృద్ధి పనులు అని ప్రకటించారన్నారు. ఆఖరికి నంద్యాల ఉప ఎన్నికల మూలంగా రెండు నెలల పరిపాలన ఆగిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారంటే వైయస్‌ఆర్‌ సీపీకి ఎంత భయపడ్డారో అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే 20 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని, అప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుందని సవాలు విసిరారు. 

ఒక్క గెలుపే బీరాలు పలకడం సిగ్గుచేటు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిన తరువాత 18 ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని పార్థసారధి గుర్తు చేశారు. ఒక్క గెలుపుకే బీరాలు పలుకుతున్నారంటే మీ స్థాయి ఏంటో ప్రజలకు అర్థం అవుతుందన్నారు.  కడపలో వైయస్‌ జగన్‌ పోటీ చేస్తే 6,92,251 ఓట్లు వస్తే..టీడీపీకి 1,29,565 ఓట్లు వచ్చాయన్నారు. నెల్లూరులో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీ చేస్తే 5,35,436 ఓట్లు వస్తే.. టీడీపీకి 1,54,103 ఓట్లు వచ్చాయన్నారు. అదే విధంగా పులివెందుల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పోటీ చేస్తే 1,10,098 ఓట్లు వస్తే.. టీడీపీకి 11 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఇటువంటి చరిత్ర ఉన్న టీడీపీ ఒక్క ఉప ఎన్నికల్లో విజయం సాధించి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 

బెదిరింపులు, ప్రలోభాలేనా మీ మోడల్‌
నంద్యాల మోడల్‌నే రాబోయే ఎన్నికల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మాకు ఓట్లు వేయకపోతే పెన్షన్లు, రేషన్‌ కార్డులు కట్‌చేస్తాం.. ఇల్లు ఇవ్వం అని ఓటర్లను బెదిరించడమేనా మీ మోడల్‌ అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో రూ. 35 వేల కోట్లు ఖర్చు చేసి గెలవాలని ప్లాన్‌ చేస్తున్నారా చంద్రబాబూ అని నిలదీశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆర్గనైజింగ్‌కు సంబంధించిన వాటిపై కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేశారన్నారు. శిల్పా ఇంటిపై దాడులు చేపట్టి, నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. పరిపాలన గాలికొదిలేసిన చంద్రబాబు బెదిరింపు కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా.. లేదా అని నాలుగు రోజులు నంద్యాలలో తిష్టవేశారన్నారు. టీడీపీ పాలనలో తెల్లరేషన్‌ కార్డుదారులకు ఇవ్వాల్సిన సరుకులు ఎత్తివేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారన్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా పక్కా ఇల్లు కట్టించలేదని, ఇసుక, మట్టి, భూదందాలతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారన్నారు. టీడీపీ ఎన్ని బెదిరింపు కార్యక్రమాలు చేసినా 70 వేల మంది ధైర్యంగా వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేశారని, వారందరికీ హ్యాట్సాఫ్‌ తెలిపారు. చంద్రబాబు నంద్యాలకు ఇచ్చి వాగ్ధానాలు నెరవేర్చకపోతే చూస్తూ ఊరుకోమని, భరతం పడతామని హెచ్చరించారు.
Back to Top