పిరికిపందల్లా వ్యవహరిస్తున్న అధికారపక్షం

  • రోజాను సభకు దూరం చేయాలని బాబు కుట్ర
  • స్పీకర్‌ అనుమతి లేకుండా అసెంబ్లీ వీడియోలు ఎలా విడుదల చేస్తారు
  • రోజా సస్పెన్షన్‌ను వెనక్కుతీసుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌
విజయవాడ: ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరించొద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఏడాది పాటు అన్యాయంగా రోజాపై సస్పెన్షన్‌ వేటు వేసి మరో సంవత్సరం పొడిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణితో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన అసెంబ్లీ భవనంలో మంచి సాంప్రదాయాలు నెలకొల్పుదాం.. ప్రశాంతమైన వాతావరణంలో పరస్పరం గౌరవించుకుందాం అనే ఆలోచన లేకుండా అధికార పార్టీ ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ మహిళా అధ్యక్షురాలు, ప్రజాధరణ కలిగిన నాయకురాలు ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్‌ చేయాలని ప్రివిలేజ్ కమిటీ రికమెండ్‌ చేయడం దురదృష్టకరమన్నారు. దాదాపు సంవత్సరం నాలుగు నెలల పాటు సస్పెన్షన్‌ ఎదుర్కొన్న రోజాపై మరో ఏడాది పొడిగించాలని ఇంత ఆలస్యంగా సిఫారస్సులు రావడం దురుద్దేశపూరితం అన్నారు. ఇది ప్రివిలేజ్‌ కమిటీ గౌరవానికే కలంకం అని హితవు పలికారు. 

వాస్తవాలు బయటకొస్తాయనే టీడీపీ కుట్ర
కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రభుత్వాన్ని సభలో నిలదీసిందుకు రోజాపై కక్షపూరితంగా సస్పెన్షన్‌ వేటు వేశారని ఎమ్మెల్యే విశ్శేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు కాల్‌మనీ రాకెట్‌లో ఉన్నాయని, ఇవన్నీ చర్చకు వస్తే చంద్రబాబు సర్కార్‌ బాగోతాలు ఎక్కడ బయటపడతాయోనని రూల్స్‌కు వ్యతిరేకంగా ఏడాది పాటు వేటు వేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా తప్పుబట్టారని గుర్తు చేశారు. మహిళలపై జరిగిన అరాచకాలు, ఆకృత్యాలు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. మహిళా ఎమ్మెల్యే అనే సానుభూతి కూడా చూపకుండా, రోజా గొంతు నొక్కాలనే దురుద్దేశంతోనే దురదృష్ట నిర్ణయం తీసుకున్నారన్నారు. కొద్ది రోజుల తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యే అనితతో మరో ఆరోపణ చేయించి ప్రివిలేజ్‌ కమిటీకి పంపించి రోజాపై కక్షపూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మనస్ఫూర్తిగా చెప్పలేదని ఎలా చెబుతారు?
మహిళా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న సమర్థవంతమైన నాయకురాలు రోజాను ఎదుర్కోలేక అధికార పక్షం పిరికిపందల్లా వ్యవహరిస్తోందన్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని, ఆ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ప్రతినిధి లేకుండా ఉండడం అప్రజాస్వామికం అని సుప్రీం కోర్టు కూడా డైరెక్ట్‌ చేసిందన్నారు. అలాంటిది ఒక మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు ఎలా సస్పెండ్‌ చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రివిలేజ్‌ కమిటీ ముందు విచారణ వ్యక్తం చేసినా మనస్ఫూర్తిగా విచారణ వ్యక్తం చేయలేదని కమిటీ చెప్పడం దుర్మార్గమన్నారు. రాతపూర్వకంగా లేఖ ద్వారా విచారణ వ్యక్తం చేస్తే మనస్ఫూర్తిగా వ్యక్తం చేయలేదని ఎలా చెబుతారంటూ కమిటీ సభ్యులను ప్రశ్నించారు. రోజాపై మరో ఏడాది సస్పెన్షన్‌ పొడిగించాలనే నిర్ణయం మంచిది కాదని, ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే పోరాటం ఉధృతం చేస్తాం
సభాపతి అనుమతి లేకుండా అసెంబ్లీ వీడియోలను సోషల్‌ మీడియాలోకి ఎలా విడుదల చేస్తారంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు రోజా వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళితే.. స్పీకర్‌ కూడా అనుమతి ఇవ్వలేదంటూ చెప్పారని గుర్తు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ప్రజా సమస్యలపై సభలో పోరాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణరావు స్వయంగా ప్రతిపక్ష పార్టీకి ఇచ్చిన వీడియోకు, టీడీపీ వాళ్లు విడుదల చేసిన వీడియోకు ఏ మాత్రం సంబంధంలేదన్నారు.  మొత్తం మార్ఫింగ్ చేసి వైయస్‌ఆర్‌ సీపీపై, రోజాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ అనుమతి లేకుండా వీడియోలు రిలీజ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిపై ఇప్పటి వరకు చర్యలు లేవు కానీ రోజాపై మరో సంవత్సరం సస్పెన్షన్‌ ఏంటని ప్రశ్నించారు.  రోజాపై సస్పెండ్‌ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని, లేని పక్షంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అనాగరికంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుందో.. ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
Back to Top