అవినీతి సామ్రాట్‌లు చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలి..?

నరసరావుపేటః అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న టీడీపీ నాయకులు చేస్తున్న, చేసిన అభివృద్ది ఏమిటో చెప్పాలని రొంపిచర్ల మండలానికి చెందిన వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. దేశంలో అత్యంత అవినీతిమయంగా తెలుగుదేశం ప్ర‌భుత్వం ఉంద‌ని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ సర్వే చెప్పిన మాట టీడీపీ నేతలు గుర్తుచేసుకోవాలన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాగ్ కూడా టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై వేలెత్తిచూపించిందన్నారు. రొంపిచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంతో అభివృద్ధి చేశామంటూ టీడీపీ నేతలు చెబుతూ ప్రతిపక్షాలను నిందించటం సిగ్గుచేటన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్సీలను కొంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ నేతలకు వైయ‌స్సార్‌సీపీని విమర్సించే నైతిక హక్కు లేదన్నారు. దివంగ‌త మ‌హానేత‌ వైయ‌స్సార్‌ ప్రభుత్వ హయాంలో రొంపిచర్లలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైద్యశాలను ఇప్పటివరకు ప్రారంభించలేదంటే వారికి అభివృద్దిపై చిత్తశుద్ది ఏమాత్రం ఉందో అర్ధమౌతుందన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట రెండూ నియోజకవర్గాలు రెండు కళ్ళుగా చెప్పే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు, కూతురికి అప్పచెప్పి ఆ కళ్ళతో వాటిని దోచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. సమావేశంలో జిల్లా కార్య‌ద‌ర్శి పున్నారెడ్డి, రొంపిచర్ల మండల అధ్య‌క్షుడు పచ్చవ రవీంద్రబాబు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గుండాల వెంకటేష్, ఎంపీటీసీ ముండ్రు నారాయణ, పొనుగోటి వెంకటరావు, గాజుల సుబ్బారావు పాల్గొన్నారు.

Back to Top