టీడీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయం

త్వరలో జగనే సీఎం..
కమలాపురం:త్వరలో జరిగే ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ అధినేత, జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయం అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వైయస్సార్‌ సీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా, అతి విశ్వాసంతో తాము అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. 95శాతం ఓట్లు తమ పార్టీకే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 సీట్లను వైయస్సార్‌ సీపీ సొంతం చేసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

జీఎన్‌ఎస్‌ఎస్‌లో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌ను పూర్తి చేస్తే కమలాపురం నియోజకవర్గంలో 80వేల ఏకరాల విస్తీర్ణం సాగులోకి వస్తుందన్నారు. వైయస్సార్‌ హయాంలో 90శాతం మేరకు ప్రాజెక్ట్‌ పనులు పూర్తి అయ్యాయని, కేవలం 10శాతం పనులను రోశయ్య, కిరణ్, చంద్రబాబు ప్రభుత్వాలు పూర్తి చేయలేక పోతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కమలాపురం నియోజకవర్గంలో అధికార పార్టీకి 98.6 శాతం వ్యతిరేకత ఉందని సర్వేల ద్వారా తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారం చేపట్టి ప్రజలకు అన్ని అవసరాలు తీర్చుతామన్నారు. లంచాల కోసం జలగల్లా పీల్చే అధికారుల భరతం పడతామని, వారిపై తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జన్మభూమి కమిటీ సభ్యులు  లంచాలు తీసుకొని రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం పట్టణంలో నత్త నడకన సాగుతున్న రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి భూనిర్వాహిసుతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. 

 పెద్దచెప్పలి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి భూమలు కోల్పోయిన బాధితులకు తక్షణం నష్ట పరిహారం అందించాలన్నారు. గ్రంధాలయానికి స్థలం కేటాయించి సొంత భవనం నిర్మించాలన్నారు. అలాగే రైతులకు సంబంధించిన 1బీ, అడంగల్‌ తదితర వాటిలో ఉన్న తప్పులను సరిదిద్దాలని, అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించి భూమి సాగులో ఉన్న వారి పేరిట హక్కు పత్రాలను అందించాలన్నారు. అనంతరం ఆయన మండల నాయకులతో కలసి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌ రామ మోహన్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సీఎస్‌ నారాయణరెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌సీ పుల్లారెడ్డి, పీవీ క్రిష్ణారెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, లక్ష్మినారాయణరెడ్డి, అల్లె రాజారెడ్డి, కొండారెడ్డి, సునీల్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, ఖాజాపీర్, ప్రభాకర్‌రెడ్డి, హీరామియ్య, మోనార్క్, పుష్పరాజు, అంబటి సురేష్, మునిరెడ్డి, శివారెడ్డి, రవి శంకర్, చంద్రశేఖర్, బుజ్జన్న, ప్రసాద్‌రెడ్డి, రాయుడు, చంద్రబాబు, సుబ్బన్న, కమ్యూనిస్టు నాయకులు సుధాకర్, శివ శంకర్‌ ప్రసాద్, బీఎస్‌పీ ఇన్‌యచార్జ్‌ సీవీ రమణ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Back to Top