నంద్యాలలో టీడీపీ ఓటుకు నోటు

  • చర్యలు తీసుకోని పోలీసులు యంత్రాంగం
  • 20 వేల మెజార్టీతో శిల్పా గెలుపు తథ్యం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
నంద్యాల: ఉప ఎన్నికల్లో నంద్యాల ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు చేసిన తప్పులన్నీ వైయస్‌ఆర్‌ సీపీపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త నోట్లు తెచ్చింది తెలుగుదేశం పార్టీ కొరకే అనిపిస్తుందని, జేబుల్లో రూ.2 వేల నోట్ల కట్టలను తీసుకెళ్లి చాలా సులువుగా పంచుతున్నారన్నారు. మహిళలకు బొట్టుపిల్లల ప్యాకెట్లు ఇస్తేనే పచ్చ పత్రికల్లో వైయస్‌ఆర్‌ సీపీ డబ్బులు పంచుతుందని కథనాలు వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేస్తూ ఏదోరకంగా గెలవాలని తాపత్రయ పడుతుందన్నారు. నంద్యాల ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఉప ఎన్నికల్లో న్యాయానికి, ధర్మానికి ఓటు వేసి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని సుమారు 20 వేల మెజార్టీ ఓట్లతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

వ్యక్తిత్వ హననంలో బాబు ప్రథముడు
చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేయడంలో ప్రథముడని పెద్దిరెడ్డి మండిపడ్డారు. శిల్పామోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. టీడీపీలో ఉన్నంత కాలంలో శిల్పా సౌమ్యుడు అన్న చంద్రబాబు పార్టీ వీడిన తరువాత శిల్పా మోహన్‌రెడ్డి ఫ్యాక్షనిస్టు అని మాట్లాడడం పెద్ద జోక్‌ అన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి గురించి నంద్యాల ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌ సీపీ గెలుపును ఆపలేరన్నారు. 
Back to Top