ఎమ్మెల్సీ కోసం..మళ్లీ ఓటుకు నోటు

-నోటుతో ఓట్లు దండుకోవడం టీడీపీ నైజం
-తెలంగాణ మాదిరి ఏపీలోనూ  ఓటుకు నోటు 
-నారాయణ, చైతన్య, గీతం విద్యార్థులకు డబ్బుల ఎర
–వైయస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాదరెడ్డి ఆరోపణ

విశాఖపట్నంః ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా..ఆయన బృందం తిరిగి మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగజారి వ్యవహరిస్తున్నారని వైయస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ఓటరు నమోదు కార్యక్రమాల్లో లంచాలు ఎరజూపి దిగజారి మరీ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగదాంబ జంక్షన్‌ సమీపాన పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణ, చైతన్య కళాశాలలతో పాటు గీతం కాలేజ్‌ కేంద్రంగా ఓటు నమోదుకు రూ.10వేలు..ఓటు వేసిన తర్వాత రూ.20వేలు ఇవ్వడానికి టీడీపీ యత్నిస్తోందన్నారు. 

ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలోకి తొక్కుతున్నారని ప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. మున్సిపల్, పట్టణ శాఖ మంత్రి నారాయణ విద్యార్థుల్ని ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. విశాఖ నగరంలో నారాయణ కార్పొరేట్‌ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థులకు యాజమాన్యం అక్రమంగా మార్కులు ఎరగాజూపుతోందన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఐదుగురు పట్టభద్రులను ఓటరుగా నమోదు చేయాలని, అందుకు ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో 100 శాతం మార్కులు వేస్తామంటూ నారాయణ టీఎం ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. 

సింహాచలం, గాజువాక భూ సమస్య పరిష్కరిస్తామని ప్రలోభపెడుతున్నారని ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. డబ్బులు ఎరగాజూపి ఓట్లు దండుకోవడం టీడీపీ నైజమన్నారు.  క్రమబద్దీకరణ పేరిట టీడీపీకి చెందిన ఒక్కో కార్యకర్త రూ.10 నుంచి రూ.60వేలు దండుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయకుండ ఈ రోజు ,రేపు అంటూ కాలయాపన చేస్తూ బాబు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్న పార్టీకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్‌.ఫారూఖీ, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, జిల్లా అధికార ప్రతినిధి పీతల మూర్తియాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. 

 


తాజా వీడియోలు

Back to Top