పెట్రో ధరల నియంత్రణలో టిడిపి, బిజెపిలు విఫలం

పెట్రో,డిజిల్‌ ధరల
పెరుగుదలపై టీడీపీ,బీజేపీ బాధ్యత వహించాలి

వైయస్‌ఆర్‌సీపీ నేతలు
మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్

 విజయవాడః పెట్రోలు,డిజిల్‌ల ధరల పెరుగుదల ను టీడీపీ ప్రభుత్వం ఆదాయ వనరులుగా
మార్చుకుంటోందని  వైయస్‌ఆర్‌సీపీ నేతలు  మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు
మండిపడ్డారు. ప్రభుత్వానికి పెట్రోలు,డిజీల్‌ మీద పన్నుల ద్వారా 10వేల కోట్ల రూపాయల
ఆదాయం వస్తోందని దానిని, 11వేల కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం
పెట్టుకుందని ఆరోపించారు. పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్‌తో రాష్ట్ర ప్రభుత్వం
లాలూచీ రాజకీయాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం
నాడు వీరు మీడియాతో మాట్లాడారు. పెట్రోలియం ధరల అదుపు చేయాలంటూ వైయస్ ఆర్ సీపీ ఆధ్వర్యంలో
అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నామని , వాటన్నిటిని ఏమాత్రం పట్టించుకోని రాష్ట్ర
ప్రభుత్వం ఇప్పుడుఏ ముఖంతో సోమవారం
నాటి  బంద్‌లో భాగస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు.

పెట్రోల్ ధరల్లో  దుర్మార్గంగా వసూలు చేస్తున్న పన్నుల్లో 50 శాతం బీజేపీ, 50 శాతం టీడీపీలకు భాగం వుందన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో
సిలెండర్‌ధరను కేంద్రపభుత్వం 
50 రూపాయలు పెంచితే.. రాష్ట్రంలో
అక్కాచెల్లెమ్మల కంటకన్నీరు రప్పించకూడదనే మంచి ఉద్దేశ్యంతో ఆ భారాన్ని అప్పటి
వైయస్‌ఆర్‌ ప్రభుత్వం భరించిన విషయాన్ని గుర్తుచేశారు. 100 శాతం సబ్సిడీతో
సంవత్సరానికి 12 గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన
టీడీపీ దానిని నిలబెట్టుకోలేకపోయిందని, ఈ హామీ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ,ఎన్డీఏ భాగస్వామ్యంలో వంట గ్యాస్
సిలిండర్ ధర రెట్టింపు అయ్యిందన్నారు. అధిక పన్నుల భారం వేయడంతో నిత్యావసరాలు, రవాణా ఖర్చులు
పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.టీడీపీ స్వలాభం కోసం
ప్రజాశ్రేయస్సును గాలికి వదిలేసిందని మల్లాది విష్ణు మండిపడ్డారు.

 ప్రత్యేక హోదా సాధన
కోసం గతంలో  వైసీపీ బంద్‌కు పిలుపునిస్తే
కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి బంద్‌లు మూలంగా ప్రజలు ఇబ్బందులు పడతారన్న
కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరారెడ్డి , ఇప్పుడు టిడిపి తో కలిసి మరీ బంద్ కు
పిలుపునివ్వడం సిగ్గు చేటు అన్నారు. ఈ రెండు పార్టీల తీరు చూస్తే దొంగతనం చేసిన
వాడే దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు.

పెట్రోలు, డీజీల్‌ ధరల  పెరుగుదలకు టీడీపీ,బీజేపీ పార్టీలు
బాధ్యత వహించాలని  వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.  పెట్రోలు 100 రూపాయలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు తన పరిధిలోనే
ఉన్న పన్నులను తగ్గించి ఆ భారాన్ని ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలని డిమాండ్
చేశారు.  కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు సహకరిస్తామని  చంద్రబాబు లేఖ రాయడం ఒక హంతకుడే హత్యచేసిన తర్వాత క్యాండిల్‌
ర్యాలీ చేసిన తీరుగా కనిపిస్తుందన్నారు. దేశంలో అత్యధిక పన్నులు వసూలు చేసే
రాష్ట్ర్రాల్లో మన రాష్ట్ర్ర మూడో స్థానంలో వుందని విమర్శించారు. పెట్రోలియం ధరల
అదుపు చేయాల్సిన వారే నిరసన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

Back to Top