ఆక్వా ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం

ఏపీ అసెంబ్లీ: ఆనంద్‌ ఆక్వా ఫుడ్‌ పార్క్‌లో చోటుచేసుకున్న ఘటనను ప్రభుత్వం కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ఆక్వా ఘటనలో ఐదుగురు మృత్యువాత పడిన అంశాన్ని ఈ రోజు మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. ఘటన జరిగిన తరువాత పట్టించుకోని ప్రభుత్వం హుటాహుటిన మృతదేహాలను తరలించే ప్రయత్నం చేసింది. ఇలాంటి విష వాయువులు వెదజల్లే యూనిట్ల అనుమతులు ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు యజమాన్యాన్ని అరెస్టు చేయడం లేదు. విష వాయువులను గొంతేరు వాగులో కలుపుతున్నారు. మొగల్తూరులో 30 టన్నుల యూనిట్‌తోనే ఇంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తుందు్రరులో 40 టన్నుల యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి?. పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల ఉపాధి అవకాశాల సంగతేంటి? పంట పొలాల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల గొంతేరు వాగు ఒక డ్రైనేజ్‌ కాల్వగా మారింది. యాజమాన్యం బాధ్యాతరహితంగా వ్యహరించడంతో ఐదు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదకరమైన ఇలాంటి పరిశ్రమలపై ప్రజలు ఎప్పుటి నుంచో పోరాటం చేస్తున్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఇలాంటి విష పూరిత ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలంటే ముందుకు రావడం లేదు. సీఎం ఏదో స్టేట్‌మెంట్‌ ఇవ్వడం, సభను వాయిదా వేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సమగ్ర నివేదిక ఇవ్వాలి. బాధిత కుటుంబాలను ఏవిధంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలి.

Back to Top