టార్గెట్‌ కాకాణి

– టీడీపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చార్జిషీట్‌
–   దోపిడీకి అడ్డుపడుతున్నారని వరుస కేసులు
–   అధికార పార్టీ ఒత్తిడికి లొంగుతున్న పోలీసులు
–  సివిల్‌ వివాదంలో ఎమ్మెల్యే మీద కేసు నమోదు
–  నిజాలు నిగ్గు తేల్చాలని కలెక్టర్‌ను కోరినా స్పందన కరువు

నెల్లూరు:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని లొంగ దీసుకుని పార్టీలో చేర్చుకోవాలని తెలుగుదేశం నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం, సర్వేపల్లిలో జరుగుతున్న నీరు–చెట్టు అవినీతిపై యుద్ధం చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ఆయన్ను టార్గెట్‌ చేసింది.  బెదిరించి దారిలోకి తెచ్చుకోవడానికి అక్రమంగా కేసులు బనాయించే కుట్ర రాజకీయానికి తెర లేపింది. ప్రజల్లో ఆయన్ను పలుచన చేయడంతో పాటు ,  మానసికంగా ఇబ్బంది పెట్టే ద్విముఖ వ్యూహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయ దాడి చేస్తోంది. అధికార పార్టీ బనాయిస్తున్న వరుస కేసుల వెనుక అసలు ఉద్దేశం, ఇందులో దాగి ఉన్న రాజకీయ కక్ష సాధింపు చర్యలు ప్రజల్లో కాకాణి మీద సానుభూతి పెరిగేలా చేశాయి.

టీడీపీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో..
   జిల్లాలో వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ చాలా బలంగా ఉండటంతో 2014 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ  స్థానాలు గెలిచింది. టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడున్న టీంతో మళ్లీ ఎన్నికలకు పోతే నిరాశా జనక ఫలితాలే వస్తాయని సీఎం  చంద్రబాబు నాయుడు  గుర్తించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలను బెదిరించో, భయపెట్టో, తాయిలాలు ఇచ్చో ఏం చేసైనా తమ గూట్లోకి రప్పించుకోవాలని చేయరాని ప్రయత్నాలన్నీ చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ మినహా మిగిలిన వారెవరూ టీడీపీ గాలానికి చిక్కలేదు. దీంతో అధికార పార్టీ పోలీసు కేసుల వ్యూహం తెర మీదకు తెచ్చింది.  ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌ చేసింది. ఎన్నికల సమయంలో నమోదైన మద్యం కేసు విచారణ బూజు దులిపించింది. పార్టీ మారితే ఈ కేసు వీగిపోయేలా చేస్తామని జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడొకరు కాకాణితో రాయబారాలు నడిపారు. ఈ ప్రయత్నాలు ఫలించక పోవడంతో సీబీసీఐడీ మీద ఒత్తిడి తెచ్చి రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసులో కాకాణిని ఇరికిస్తూ  కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయించారు. 

ఆగని పోరాటం
    మద్యం కేసుపై చార్జిషీట్‌ వ్యవహారాన్ని లెక్కపెట్టకుండా కాకాణి సర్వేపల్లి నియోజక వర్గంలో నీరు–చెట్టు, పంట సంజీవని పథకాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల అవినీతిపై పోరాటం వేగం పెంచారు. టీడీపీ నేతలు పనులు చేయకుండానే చేసినట్లు , నాసిరకంగా పనులు చేసి కోట్లు దిగమింగేశారనే విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పనులను స్వయంగా పరిశీలించి అధికారుల ద్వారా వివరాలు రాబట్టి విచారణ జరిపించే దిశగా యుద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వాటాలు ఇచ్చి యథేచ్చగా అవినీతి చేస్తున్నారని రాజకీయ విమర్శల దాడి పెంచారు.  ఈ వ్యవహారాల్లో తమ సొంత పార్టీ నేతలు తలదూర్చినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కాకాణి కేడర్‌కు చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతల నిధుల దోపిడీకి ఇబ్బంది ఏర్పడింది.

భూ కబ్జా ఆరోపణల కేసులు
    కాకాణికి కళ్లెం వేయడానికి టీడీపీ నేతలు ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు చేయిస్తూ పోలీసు కేసులు నమోదు చేయించేందుకు తెగబడ్డారు. కాకాణి మీద నేరుగా కేసులు నమోదు చేసే అవకాశాలు దొరక్క పోవడంతో , నెల్లూరు చుట్టుపక్కల, సర్వేపల్లి నియోజక వర్గంలో కాకాణి బంధువులు, కుటుంబ సభ్యులు, మద్దతు దారులకు భూముల కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఆయన పేరు ఇరికించి కేసులు పెట్టించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే వావిలేటి పాడులో తన భార్య పేరుతో ఉన్న ఆరెకరాల భూమిని ఆనుకుని ఉన్న భూమిలోని ప్లాట్లను కాకాణి ఆక్రమించారని ప్లాట్లు కొన్న వారితో ఫిర్యాదు చేయించారు. ఫిర్యాదులోని వాస్తవాలు విచారించకుండా నెల్లూరు రూరల్ పోలీసులు కాకాణి మీద సెక్షన్‌ 447,427 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పొదలకూరు మండలం మరుపూరులో తనకు చెందిన 16.53 ఎకరాల భూమి కాకాణి అనుచరుడు గోపాల్‌రెడ్డి తనను బెదిరించి లాక్కున్నాడని నెల్లూరు టెక్కే మిట్లకు చెందిన దూది వెంకటరమణయ్యతో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కూడా ఇరికించాలని ప్రయత్నించి ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో విరమించుకున్నారు. కాకాణి సొంత గ్రామం తోడేరులో తమకు చెందిన రెండున్నర ఎకరాల భూమి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బంధువులు ఆక్రమించారంటూ నెల్లూరుకు చెందిన లక్ష్మీసుమేథ, ఆమె భర్త ప్రసేన్‌కుమార్‌రెడ్డితో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. కోర్టులో ఉన్న ఈ వ్యవహారానికి కాకాణి అడ్డుపడుతున్నారని ఆరోపణ చేయించారు.

విచారణ కోరినా ముందుకు రాని వైనం
  వావిలేటి పాడులో తాను భూమి ఆక్రమించానని నమోదైన కేసుపై విచారణ జరిపించాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి 20 రోజుల కిందట జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజును కలసి లేఖ ఇచ్చారు. తన భార్యకు ఉన్న భూమిలోనే ఎకరం దాకా ఆక్రమణకు గురైందనీ, తక్షణం సర్వే జరిపించి నిజాలు తేల్చాలని కోరారు. రెవిన్యూ అధికారులు మరుసటి రోజే భూమి దగ్గరకు పోయి సర్వే చేస్తే కాకాణి భూమే ఆక్రమణకు గురైనట్లు తేలుతుందనే విషయం గ్రహించి వెనక్కు వచ్చారు. ఆ తర్వాత సర్వే విషయం అటకెక్కించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకాణి కోర్టును ఆశ్రయించారు.

పెరుగుతున్న సానుభూతి
 కాకాణిని భూ కబ్జా దారుడిగా చూపించి ప్రజల్లో బదనాం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు వేసిన స్కెచ్‌ తిరగబడింది. కాకాణి ఇమేజ్‌ దెబ్బతీసే కుట్రతో ఆయన బంధువులు,మద్దతు దారులు, అనుచరుల వివాదాలకు ఆయన్ను లింక్‌ చేస్తూ నమోదవుతున్న కేసులు, జిల్లా కలెక్టర్, ఎస్‌పీలకు అందుతున్న ఫిర్యాదులు, వీటిపై పత్రికల్లో వస్తున్న కథనాలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవనే విషయం చదువురాని వారికి కూడా ఇట్టే అర్థం అయిపోతోంది. టీడీపీ అవినీతి మీద పోరాడుతున్నందువల్లే కాకాణిని ఇలా టార్గెట్‌ చేశారని ప్రజల్లో ఆయనకు సానుభూతి పెరుగుతోంది.

 
Back to Top