'తప్పును నిలదీస్తే అక్రమ కేసులు పెడతారా?'

ఉదయగిరి (నెల్లూరు జిల్లా): ఆరవ విడత భూమి పంపిణీ జాబితాలో అనర్హుల పేర్లు తొలగించి, అర్హులకు అవకాశం కల్పించాలని కమిటీ ముందు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలపై అక్రమంగా నాన్‌ బెయిలబుల్ కేసులు బనాయించడం దారుణమని వైయస్‌ఆర్‌సిపికి చెందిన ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇంత దుర్మార్గమైన చర్య ముందెన్నడూ చూడలేదు. ప్రజాస్వామ్యంలో తప్పును నిలదీసే వారిపై కేసులు పెడతారా? ఇదే అధికార పార్టీ నేతలకు ఉన్న నీతి. దీనిని ప్రజలు సహిస్తూ ఊరుకోరు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’ అని మేకపాటి హెచ్చరించారు.

గతంలో నెల్లూరు జిల్లాలో ఐదు విడతలుగా భూమి పంపిణీ జరిగిందని, ఏ ఒక్క ఏఆర్‌సీ సమావేశంలోనూ అవకతవకలు జరిగాయన్న దాఖలాలు లేవన్నారు. తాను కమిటీ చైర్మన్‌గా అన్ని పార్టీల వారికి, అర్హులైన ప్రతి ఒక్కరికీ కళ్లు మూసుకొని సంతకం చేశానన్నారు. ప్రస్తుతం వైయస్‌ఆర్ సానుభూతిపరులనే ఉద్దేశంతో అనేక‌ మంది అర్హుల పేర్లు జాబితాలో చేర్చలేదన్నారు. భూస్వాములు, గ్రామంలో లేనివారి పేర్లను ఏకపక్షంగా చేర్చి, భారీగా డబ్బు గుంజేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమి పేదలకే దక్కా లి తప్ప ధనవంతులకు ఇచ్చేందుకు సమ్మతించబోనని అన్నారు. తన హయాంలో ఉదయగిరిని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ఇందులో సందేహం ఉంటే బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు.

ప్రజలకు జరిగిన అన్యాయంపై కమిటీ చైర్మన్‌గా సమావేశంలో ప్రశ్నిస్తే దానికి అధికార పార్టీ నేతలు ఉదయగిరి తహశీల్దారు, పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమపై నాన్ బెయిలబు‌ల్ కేసులు నమోదు చేయించడం ఎంతవరకు స‌మంజసమని మేకపాటి ప్రశ్నించారు. తమపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయకపోతే తగిన రీతిలో ఎదుర్కొంటామన్నారు.
Back to Top