లెక్కలడిగితే జంకుతారెందుకు?

హైదరాబాద్, డిసెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం వెల్లడించేందుకు అధికార పక్ష నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నిలదీసింది. టీడీపీ నేతలు తిన్నవి, దోచుకున్నవి బయట పడతాయనేనా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ప్రభుత్వ రాబడులు, వ్యయాల వివరాలు కావాలని ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగితే మంత్రులు ఆయనపై ఎందుకు ఎదురుదాడికి దిగితున్నారని ధ్వజమెత్తారు. పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచాలని శ్రీ వైఎస్ జగన్ అడగడం తప్పా? ప్రతిపక్ష నేతగా సమాచారం కావాలని కోరే హక్కు ఆయనకు ఉంది. వివరాలడిగితే అధికార పక్షం ఎందుకు జంకుతోంది?  అని ప్రశ్నించారు. పాలనలో పారదర్శకత, ఈ గవర్నెన్స్ అని తరచూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్ధిక సమచారం వెల్లడించేందుంకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో చెప్పాలన్నారు. బడ్జెట్ లో వివరాలన్నీ ఉన్నాయని ఆర్ధికమంత్రి యనమల చెప్పడం సరికాదన్నారు. బడ్జెట్ లో ఉండేది అంచనాలేనని, వాస్తవిక ఆదాయ, వ్యయాలు ఎక్కడుంటాయని ప్రశ్నించారు. 
జవాబు లేక శ్రీ జగన్ గారిపై విమర్శలా?

'పింఛన్లు 43 లక్షల మందికి ఇవ్వాలంటే సుమారు రూ. 3800 కోట్లు అవసరం. బడ్జెట్ లో మాత్రం రూ. 1338 కోట్లే కేటాయించారు. ఫీజుల రీయింబర్స్ మెంట్ కొరకు రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ. 2 వేల కోట్లే కేటాయించారు. రూ. 50 వేల లోపు రుణాలు పూర్తిగా మాఫీకి రూ. 14 వేల కోట్లు కావాల్సి ఉంటే రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ఇంత తక్కువ కేటాయింపులతో ఎలా అన్నీ పనులు చేస్తారని శ్రీ వైఎస్ జగన్ అడిగితే తప్పా? దీనికి జవాబు చెప్పలేక మంత్రులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగితారా? అని పార్థసారథి దుయ్యబట్టారు. ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే ఆర్ధిక వివరాలన్నీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ ప్రభుత్వం తీరు మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థను తలపిస్తుందని పార్థసారథి మండిపడ్డారు. ఓడించి లోబర్చుకున్న శత్రురాజ్యంలోని ప్రజలను గెలిచిన రాజులు ఇబ్బందులు పెట్టినట్లుగానే టీడీపీకి ఓట్లేయని వారి పట్ల అధికారపక్షం వ్యవహరిస్తుందన్నారు. తమకు ఓట్లేయని వర్గాల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నట్లుగా సాక్షాత్తూ ఓ సీనియర్ మంత్రి మాట్లాడుతున్నారని చెప్పారు. పేద వర్గాల ప్రజలు తమకు ఓట్లేయలేదు కనుక వారి గురించి ఆలోచించబోమని, ఎన్నికల్లో సహకరించిన వారికి కొమ్ముకాస్తామనే రీతిలో మాట్లాడటం తగదన్నారు. 

వైఎస్ఆర్ సజీవంగా ఉన్నపుడు పోలవరం కాలువలు తవ్విస్తే దోపిడీ జరిగిపోతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇపుడు అదే కాల్వల ద్వారా గోదావరి నీళ్లు డెల్టాకు ఇస్తామని చెప్పుకుంటున్నారని పార్థసారథి చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 854 అడుగుల వరకూ ఉండాలని నాడు వైఎస్ఆర్ జారీ చేసిన ఇపుడు టీడీపీ ప్రభుత్వానికి దిక్కయిందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top