దేవుని మాన్యాలను రక్షించాలంటే.. వాటిని కైంకర్యం చేస్తున్న మీ బినామీలను శిక్షించాలి కదా..

10–05–2018, గురువారం

గన్నవరం క్రాస్, కృష్ణా జిల్లా

గ్రామీణ పేద విద్యార్థులకు
అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలన్న సత్సంకల్పంతో నాన్నగారు ట్రిపుల్‌
ఐటీలను ఏర్పాటుచేశారు. ఏ కార్పొరేట్‌ విద్యావ్యవస్థకు తీసిపోని రీతిలో వాటిని
తీర్చిదిద్దారు. కానీ ఈ రోజు నన్ను కలిసిన నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు
చెప్పిన విషయాలు వింటుంటే.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవని అర్థమైంది. సార్‌.. మా ట్రిపుల్‌ ఐటీలో
సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నవాళ్లలో అత్యధికులు కాంట్రాక్టు ఉద్యోగులే.
సౌకర్యాల కొరత తీవ్రంగానే ఉంది. 

ఇది చాలదన్నట్టు.. తన హయాంలోనూ ట్రిపుల్‌ ఐటీ పెట్టానని చెప్పుకోడానికేమో..
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీని బాబుగారు ఏర్పాటుచేశారు. పేరుకే అక్కడ ట్రిపుల్‌ ఐటీ..
దాన్నిప్పుడు నూజివీడు క్యాంపస్‌ నుంచే నడుపుతున్నారు. దీంతో అన్ని రకాల సదుపాయాల
కొరతతో విద్యార్థులందరం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాం. పైపెచ్చు.. నిరుపేద ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు
అసంపూర్తిగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ అని వారు ఆవేదన వ్యక్తం
చేశారు. ‘ఎడ్యుకేషన్‌లోనూ
మునుపటి నాణ్యమైన బోధన లేదు.

ఎన్నో ఆశలతో ట్రిపుల్‌
ఐటీలలో అడుగు పెట్టిన మాకు నిరాశాజనక పరిస్థితులే ఎదురవుతున్నాయి. గతంలోలా కోర్సు
అయిపోతే ఉద్యోగాలు తప్పక వస్తాయన్న ధైర్యం లేకుండా పోతోంది. మాలాంటి గ్రామీణ
విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మీరు వచ్చాకైనా ట్రిపుల్‌ ఐటీ వ్యవస్థను
కాపాడండి’ అని
వారు కోరుతుంటే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలుచేయడంతో పాటు
ట్రిపుల్‌ ఐటీ వ్యవస్థకు మునుపటి ప్రాభవాన్ని తీసుకురావాలన్న నా సంకల్పం మరింత
బలపడింది. 

ఉదయం పాదయాత్ర ప్రారంభించిన
కాసేపటికే.. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు వచ్చి కలిశారు. ఇరవై ఏళ్లకు పైగా
దేవాలయాల్లో పనిచేస్తున్నా.. ఇప్పటికీ చాలీచాలని జీతాలతోనే బతుకుల్ని
నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతులు లేవు, ఉద్యోగ భద్రతా లేదు.. అంటూ
బాధగా నిట్టూర్చారు. ‘ఈ
పాలనలో దేవాలయాలు పూర్తిగా నిరాదరణకు గురవుతున్నాయి. దేవునికి నైవేద్యం
పెట్టడానికే ఇబ్బందిగా ఉంది. ఇక మా జీతాల మాట ఆ దేవునికే తెలియాలి.నెలల తరబడి
రాకున్నా నోరెత్తలేని పరిస్థితి’ అంటూ తీవ్ర నిరాశానిస్పృహలను
వ్యక్తం చేశారు.

‘గుడిని, గుడిలో లింగాన్నీ మింగే
నాయకుల స్వార్థంతో గుడిమాన్యాలు, దేవాలయ ఆస్తులు
కైంకర్యమైపోతున్నాయి. ఈ ప్రభుత్వం అనేక రకాల ఆంక్షలు పెడుతూ, సాకులు చూపిస్తూ.. ధూపదీప
నైవేద్యాల పథకం కింద ఉన్న దేవాలయాల సంఖ్యను సైతం తగ్గించివేసింది. నాన్నగారి
హయాంలో ధూపదీప నైవేద్యాలతో వెలిగిన ఆలయాల్లో ఇప్పుడు దీపాలు మలిగిపోయే పరిస్థితి
దాపురిస్తోంది’ అంటూ
అర్చకులు, ఇతర
సిబ్బంది వ్యథనంతా వెళ్లగక్కారు. కొసమెరుపేమిటంటే.. భవిష్యత్తులో ఎండోమెంట్‌
భూముల్ని కాపాడలేమంటూ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం! దేవుని
మాన్యాలను రక్షించాలంటే.. వాటిని కైంకర్యం చేస్తున్న మీ బినామీలను, మీ నాయకులను శిక్షించాలి
కదా!

ముఖ్యమంత్రిగారికి నాదో
ప్రశ్న.. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరే ఎండోమెంట్‌ భూముల్ని కాపాడలేమని
చెప్పడం ఎంత సిగ్గుచేటు! గుడి భూముల్ని, సత్రం భూముల్ని వేటినీ
వదలకుండా మింగేస్తోంది మీ ప్రభుత్వ హయాంలోనే కదా? సదావర్తి భూములే అందుకు
నిదర్శనం కాదా? కనకదుర్గమ్మ
గుడిభూములు సాక్ష్యం కాదా? మీ
పాలనలోనే గుళ్లలో అపచారాలు, తాంత్రిక
పూజలు, ఆభరణాల
దొంగతనం.. వంటి సంఘటనలు జరుగుతున్నాయని మర్చిపోయారా?  

Back to Top