తాగునీరివ్వలేని మంత్రీ ఒక మంత్రేనా!!

హాలియా 14 ఫిబ్రవరి 2013:

మంత్రి జానారెడ్డి నియోజకవర్గంలో శ్రీమతి వైయస్ షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం సాయంత్రం ఆరు గంటలకు హాలియా చేరుకుంది. హాలియాకు జనం పోటెత్తారు. వైయస్ఆర్,  జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు.  హాలియాలో ఏర్పాటైన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. స్థానిక  ఎమ్మెల్యే జానారెడ్డిపై వ్యంగ్యోక్తులు విసిరారు. మహానేత రాజశేఖరరెడ్డి ఆ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని కళ్ళకు కట్టేలా చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆమె ప్రసంగం ఆమె మాటలలోనే...

నియోజకవర్గాన్ని చూస్తే చాలు... జానారెడ్డి గురించి అర్థమవుతుంది
      'స్థానిక ఎమ్మెల్యే జానారెడ్డికి ముపై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. మంత్రి పదవిలో ఉన్నారు. సీఎం వెయింటింగులో ఉన్నారిపుడు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నారు పెద్దలు. నియోజకవర్గాన్ని చూస్తే ఆయన ఎలాంటి మనిషో అర్థమవుతోంది. ఒక్క డిగ్రీ కాలేజీ లేదు.. పాలిటెక్నిక్ లేదు. ఐటీఐ లేదు.  జూనియర్ కాలేజీ తప్ప ఇక్కడ ఏమీ లేదు. చదువుకోవాలంటే సుదూరాలకు వెళ్ళాల్సిందే. ఆ విషయం జానారెడ్డికి తెలుసు. అందుకే 2009 ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ తెస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకూ దానికి దిక్కు లేదు. సాగు నీరు, తాగు నీరు ఇవ్వని మంత్రీ ఒక మంత్రేనా.. పైపు లైన్ల ద్వారా నీరిస్తానన్నారు.. ఏమైంది జానారెడ్డిగారూ!
     రైతులు అల్లాడి పోతున్నారు. మద్దతు ధర లేదు. అప్పుల్లో కూరుకుపోయారు. కన్నీళ్ళు, కష్టాలు. రైతులకు కరెంటు బిల్లులు  ఇస్తున్నారు.  కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకుపోతున్నారు. మహానేత ఉన్నప్పుడు పరిస్థితి ఇలా లేదు. ఆయన కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేశారు. ఉచిత కరెంటు ఇస్తానన్నారు. ఇచ్చి చూపించారు.  రైతుకు నష్టం వస్తే నష్ట పరిహారం ఇచ్చారు. రాజన్న రైతుల్ని ప్రేమించారు. వారు బాగు పడాలనుకున్నారు.'
 
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు
      'ఈ  ప్రభుత్వానికి పెద్ద మనసు లేదు. కనీసం పేద వాడికి పట్టెడన్నం పెట్టలేకుండా ఉంది. పిల్లలను కూలీకి పంపితున్నారు. ఎందుకమ్మా అంటే డబ్బులొస్తాయని మహిళలు చెబుతున్నారు. లేకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని అడగండి. రుణాలిస్తున్నామని కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి ప్రకటనలు ఇస్తున్నారు. ఎవరినడిగినా అందటం లేదంటున్నారు. ఎవరికిస్తున్నారు.' అని శ్రీమతి షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. 'పల్లెల్లో కరెంటు ఉండదు. ఛార్జీలు పెరుగుతున్నాయి. బిల్లు కట్టకపోతే సామాను పట్టుకుపోతున్నారు. వడ్డీలకు అప్పు తెచ్చి వాటిని విడిపించుకుంటున్నామని' మహిళలు చెబుతున్నారని చెబుతూ పరిస్థితి తీవ్రతను ఇది కళ్ళకు కడుతోందని ఆమె స్పష్టంచేశారు.

పన్నుపోటు లేకుండానే రాజన్న అభివృద్ధి చేశారు
     రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు, బస్సు చార్జీలు పెంచలేదు. గ్యాస్ ధర పెంచలేదు. పన్ను,చార్జీ పెంచకుండానే అభివృద్ధి చేపట్టారు. ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. ప్రస్తుతం పిల్లలకు చదవాలనే ఆశ ఉన్నా స్థోమతు లేక ఇంట్లో కూర్చున్నారు. వారిని చదివించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారి జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు.   రాజన్న హయాంలో 108 ఇరవై నిముషాల్లో వచ్చేది. ఇప్పడు ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తోందన్నారు.  పింఛను, రేషను కార్డు ఇవ్వడం లేదు సరికదా  ఉన్న కార్డులలో ముపై శాతం తీసేశారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

సాగర్ కాల్వల ఆధునీకీకరణ పూర్తి పట్టని ప్రభుత్వం
      మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాగార్జునసాగర్ కాల్వల ఆధునికీకరణకు ఐదు వేల కోట్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చారనీ, అందులో సగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి మిగిలినది ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చారనీ ఆమె తెలిపారు. ఆయన జీవించి ఉండగా ఆ పనులు అరవై శాతం వరకూ పూర్తయ్యాయనీ,  మిగిలిన పనులను ఈ కాంగ్రెస్ సర్కారు ఇంతవరకూ పూర్తిచేయలేదని విమర్శించారు.  దీనిని బట్టే రైతన్నపై రాష్ట్ర ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి వెల్లడవుతోందన్నారు. వరద కాల్వల వల్ల ఎనబై వేల ఎకరాలకు సాగు నీరందించాలని రాజన్న భావించారనీ,  ఆయన ఉండి ఉంటే అది కూడా పూర్తయ్యేదనీ, ఈ సర్కారు చేతుల్లో అది కూడా నత్తనడక నడుస్తోందనీ చెప్పారు.  
     నల్గొండ జిల్లాలో ఎయిమ్సు మాదిరిగా నిమ్సు ప్రారంభించాలని రాజన్న భావించి,  ముఖ్యమంత్రి కాగానే ఆ పనులు మొదలుపెట్టారన్నారు. 2009నాటికి పనులన్నీ పూర్తయ్యాయనీ, కేవలం ఔట్ పేషెంట్ సేవలను మాత్రమే ప్రారభించాల్సి ఉందనీ ప్రకటించారన్నారు. తర్వాత రాజన్న మరణించడంతో  ఆ పని అలాగే మిగిలిపోయిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

చంద్రబాబుపై నిప్పుల తూటాలు

     ఇంత అధ్వానంగా ఉన్న ఈ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనంటున్నారనీ, దీనికో లెక్కుందనీ ఆమె చెప్పారు. రెండున్నర ఎకరాలనుంచి  పెరిగిన చంద్రబాబుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా హెరిటేజ్ దుకాణాలున్నాయన్నారు. దేశవిదేశాలలో ఆస్తులున్నాయన్నారు. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఐఎమ్‌జీ సంస్థని తన బినామీ సంస్థకి కట్టబెట్టారని తెలిపారు. దానివిలువ పదేళ్ళ క్రితమే రెండున్నర వేల కోట్లన్నారు. దీనిని కేవలం నాలుగు కోట్ల రూపాయలకు చంద్రబాబు తన బినామీ సంస్థకు ఇచ్చేశారని చెప్పారు. కమ్యూనిస్టులు 'చంద్రబాబు జమానా అవినీతి ఖజానా' అని పుస్తకం రాశారనీ, ఎన్టీరామారావు తాను రాసుకున్న పుస్తకంలో 'చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఉండ'డని రాసుకున్నారని ఆమె వివరించారు. ఎన్ని ఆరోపణలున్నా చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకుంటారని ఆరోపించారు. అందుకనే కాంగ్రెస్ వారు ఆయనపై ఏ కేసులూ పెట్టరు.. ఏ విచారణా చేయరు.. దీనికి ప్రతిఫలంగా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కృతజ్ఞత చూపుతార'ని ఆమె పేర్కొన్నారు. తన పాదయాత్రలో చంద్రబాబు పేరుకు మాత్రం విమర్శిస్తారన్నారు. ఇది పనికిరాని ప్రభుత్వమనీ, తుగ్లక్ పాలననీ, ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదనీ అనే బాబు అవిశ్వాసం పెట్టమంటే జంకుతారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పడిపోదనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపితే అప్పుడు చంద్రబాబు అవిశ్వాసం పెడతారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నారన్నారు. అందుకనే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపాక ప్రభుత్వం పడిపోదని తేలాక అవిశ్వాసం పెట్టారని శ్రీమతి షర్మిల ఉదాహరణగా చెప్పారు. ఎన్నికల రోజున మాత్రం తనను జ్ఞాపకం చేసుకోమనీ అంటుండాన్ని బట్టి చంద్రబాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు. పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారనీ, వీటిని వింటుంటే 'అమ్మకు అన్నం పెట్టడు గానీ, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడ'నే సామెత గుర్తుకొస్తోందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణ మాఫీ ఎందుకు చేయలేదని ఆమె బాబును నిలదీశారు. రాజన్న ఉచిత విద్యుత్తు ఇస్తానంటే హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడెలా ఆ హామీ ఇస్తున్నారని శ్రీమతి షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు.

Back to Top