కేసీఆర్ ది అంతా ప్రచార ఆర్భాటమేప్రజలపై భారం మోపడమేనా? బంగారు తెలంగాణ??సంబరాలకు రూ. 300 కోట్లు అవసరమా?డబ్బులకు కొదవలేదని చెబుతూ ఛార్జీలు ఎందుకు పెంచారువైయస్ఆర్ హయాంలో చిల్లిగవ్వకూడా పెంచలేదుకేసీఆర్ మాటలన్ని బక్వాస్ మాటలువైయస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజారంజక పరిపాలనపై ఏమాత్రం శ్రద్ధలేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే బస్సు, విద్యుత్ ఛార్జీలు పెంచడమేనా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మనకు నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు ఏ లోటు లేదని, సుమారు రూ. 30 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉందని కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. గ్రేటర్, వరంగల్, ఖమ్మం ఎన్నికలు అయిపోయాయి.. ఇక నేను ఏం చేసినా ఎదురేముందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటే ప్రజలపై భారం మోపడమేనా అని నిలదీశారు.
ప్రజలపై పెనుభారం మోపుతున్న కేసీఆర్ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటి కోసం, తాను ప్రయాణించే బస్సు కోసం, ఆఖరికి తన శాంతాడంత కాన్వాయి కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెడుతున్నారు . కానీ ఆర్టీసీని కాపాడుకోవడంలో మాత్రం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ రెండు సంవత్సరాల కాలమంతా సంబరాలే తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు. ఏ టీవీ, ఎఫ్‌ఎం, పేపర్ చూసినా సంబరాల ప్రకటనలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తి కాకపోయినా బంగారు తెలంగాణ అని ప్రచారం చేయడానికి రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రచార ఆర్భాటానికి రూ. 300 కోట్లు ఖర్చుపెడుతూ ప్రజలపై భారం వేయడానికి రూ. 286 కోట్ల బస్సు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది రోజుల క్రితం ఆర్టీసీ మూసేస్తామని చెప్పి కార్మిక, యాజమాన్యాల్లో బెదరగొట్టారని పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో సమావేశమై రోజుకు రెండు కోట్ల నష్టం వస్తుందని చెప్పి 24 గంటల్లో రూ. 286 కోట్ల భారాన్ని వేశారని మండిపడ్డారు.
ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలిరాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొండా రాఘవరెడ్డి విమర్శించారు. పదుల కొద్దీ పరిశ్రమలు రోజురోజుకూ మూతపడుతుంటే విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకా పరిశ్రమలు మూతపడే దుస్థితిని కల్పిస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ డబ్బులకు కొదవలేదు అని మాట్లాడుతూ ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని కడిగిపారేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిశ్రమలు రాష్ట్రంలోకి వస్తున్నాయని వారి కోసం వేల ఎకరాల భూములు, కరెంట్ ఛార్జీలను తగ్గిస్తున్నామని చెప్పుకుంటూ... విద్యుత్‌ఛార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సూక్ష్మ, చిన్నతరహా పారిశ్రామిక వేత్తలను ఇబ్బందిపాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఏడున్నర శాతం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం వల్ల ప్రజలపై రూ. 1527 కోట్ల భారం పడుతుందన్నారు.
ఇదేనా బంగారు తెలంగాణ??హైదరాబాద్ జంటనగరాల్లో సుమారు 41 లక్షల విద్యుత్ కనెక్షన్‌లు ఉంటే వాటిలో 35 వేల గృహ సరఫరాలు ఉన్నాయని చెప్పారు. 41 లక్షల కనెక్షన్‌లలో 15 లక్ష మందికి మాత్రమే వంద యూనిట్లలోపు విద్యుత్ సరఫరా ఉంటే మిగతా 20 లక్షల కనెక్షన్‌లకు బాదుడే బాదుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. కరెంట్ ఛార్జీల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజానికంపై రూ. 680 కోట్ల పెనుభారాన్ని మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇదేనా బంగారు తెలంగాణ అని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు, నీళ్లు ఉంటాయని కళ్ల బొల్లి మాటలు చెప్పి రెండు సంవత్సరాలలోనే ప్రజలపై భారం వేసే పరిస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చెప్పే మాటలు బక్వాస్ మాటలని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఒకవైపు రైతులను ఈ పంట వేయోద్దు, ఆ పంట వేయోద్దు అని చెబుతూ కరెంటు ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. ఇన్‌కంట్యాక్స్ కట్టేవాళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారీ నిరసన ర్యాలీకేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కొండా రాఘవరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద 10 గంటలకు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చెప్పేమాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనలేదని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీలపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
వైయస్సార్ ది ప్రజారంజక పాలనఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ...మేనిఫెస్టోలో పెట్టిన వాటితో పాటు అందులో లేని సంక్షేమ పథకాలను కూడా నూటికి నూరుశాతం అమలు చేసిన ఘనత దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్ హయాంలో ఒక్క చిల్లిగవ్వకూడా ప్రజలపై భారం మోపకుండా ప్రజారంజక పాలన చేశారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్ మాదిరిగా పరిపాలించాలని కొండా రాఘవరెడ్డి కేసీఆర్‌కు సూచించారు.