24న ఇందిరాపార్క్ వద్ద ధర్నా

  • వైయస్ఆర్ 23 జిల్లాలను పాలించి శభాష్ అనిపించుకున్నారు
  • కేసీఆర్, చంద్రబాబులు సరిగా పాలించలేక బద్మాష్ లయ్యారు
  • ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
  • వైయస్ఆర్ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేవరకు..
  • ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది
  • టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి శివకుమార్
హైదరాబాద్ః దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి శివకుమార్ మండిపడ్డారు. 23 జిల్లాలను సమగ్రంగా పాలించి వైయస్ఆర్ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటే...కేసీఆర్, చంద్రబాబులు సరిగా పాలించలేక బద్మాష్ లుగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.  రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి, కోటి ఆశలు, అంతులేని హామీలు గుప్పించి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భారతదేశంలోనే ఏ రాష్ట్రం లేనట్టుగా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ చేతల్లో మాత్రం ఏమీ చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రతీ పేద విద్యార్థి ఉన్నతమైన చదువులు చదవాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు గానీ, ప్రస్తుత ప్రభుత్వాలు  గానీ వైయస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా  విఫలమయ్యాయని ఆరోపించారు. 


చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులున్నారని  శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 4,5 వడ్డీకి అప్పులు తెచ్చుకొని ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని అన్నారు. ఫీజులను చెల్లించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 24న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఈ ధర్నాలో తెలంగాణ పార్టీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి పాల్గొంటారని, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై ధర్నాను విజయవంతం చేయాలని  పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శివకుమార్ పిలుపునిచ్చారు. 

ప్రచార ఆర్భాటం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క పథకం ప్రజలకు చేరువ కావడం లేదని, నిధులన్నీ పక్కదారి పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తన స్వలాభం కోసం తప్పుడు వాగ్ధానాలతో గద్దెనెక్కి తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని శివకుమార్ మండిపడ్డారు.   విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి వారి జీవితాలతో చెలగాటం ఆడడం తగదని సూచించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన హామీ ఏమైందని శివకుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతీ విద్యార్థికి న్యాయం జరిగే వరకు, వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకు చేేరేవరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.  కళాశాలలకు బాకీ పడిన రూ. 3600 కోట్లు చెల్లించాలని టీఆర్ఎస్ సర్కార్ ను డిమాండ్ చేశారు. 

  


 
Back to Top