స్వతంత్ర సంస్థా? యూపీఏ జేబు సంస్థా?

దుగ్గిరాల 21 మార్చి 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నది ప్రజల కోసమా లేక కాంగ్రెస్ పార్టీ కోసమా అనేది అర్థం కావడం లేదని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె చంద్రబాబుపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా నిప్పులు కురిపించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. తెనాలి నుంచి ఉదయం బయలు దేరి దారిలో రైతులు, మహిళలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ భరోసా కల్పిస్తూ దుగ్గిరాల చేరుకున్నారు. మీకోసం వస్తున్నాననంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు దారిలో ఎదురైన ప్రజల కష్టాలను చూసి కూడా.. ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచలేదంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లే కదా అని ప్రశ్నించినపుడు ప్రజల నుంచి అవును అవును అని సమాధానం వినిపించింది. స్వప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆమె చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అమ్ముడుపోయారని ఆరోపించారు. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను వెన్నుపోటు పొడిచి చరిత్ర హీనుడిగా మారారని శ్రీమతి షర్మిల తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలకు నీతి, నిజాయితీ, విలువలు ఏకోశానా పట్టవని చెప్పారు. విశ్వసనీయత అంతకంటే లేదన్నారు. వీరికి తెలిసిందల్లా నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేయడమేనని స్పష్టంచేశారు. అలాంటి రాజకీయాలతోనే అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మని ఆ సంస్థ మాజీ డైరెక్టర్ జోగిందర్ సింగ్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలైనా, వ్యక్తులైనా వారికి వ్యతిరేకంగా ప్రయోగించే అస్త్రంగా సీబీఐ మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిమీద సీబీఐని ఉసిగొల్పి తనదారికి తెచ్చుకుంటుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి, అనుకూలంగా నడుచుకుంటున్నారు కనుక ఆయనపై సీబీఐ ఏ కేసులూ పెట్టదనీ, ఏ విచారణా చేపట్టదనీ శ్రీమతి షర్మిల చెప్పారు. చిరంజీవిగారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా అమ్మేసుకున్నారు కనకనే, ఆయన బంధువు ఇంటిలో డెబ్బై కోట్ల రూపాయలు దొరికినా సీబీఐ కంటికి కనిపించడం లేదని ఆరోపించారు.

ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేపట్టిన జగనన్నకు పొగబెట్టి పార్టీ నుంచి కాంగ్రెస్ బయటకు పంపించిందన్నారు. తమకు వ్యతిరేకమయ్యాడు కాబట్టే ఆయనపై సీబీఐని ఉసిగొల్పి జైలుపాలుచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఈపాటికి మంత్రో, ముఖ్యమంత్రో అయ్యుండేవారనీ, వ్యతిరేకించి ఎన్ని తిప్పలు పడుతున్నాడోనని గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమిళనాడులో డీఎమ్‌కే కేంద్రానికి మద్దతు వెనక్కి తీసుకోవడంతో కరుణానిధి కుమారుడిపై సీబీఐ దాడులు చేపట్టింది.  కొన్ని గంటలకే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశాయన్నారు. దీనితో దిక్కుతోచక సీబీఐని వెనక్కి పిలిపించారని ఆరోపించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యిందనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమేనని ఆమె ఉదహరించారు. స్టాలిన్ ఇంటిమీద ఎందుకు దాడి చేశారు.. ఎందుకు వెనక్కి తగ్గారో ప్రజలకు ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో, సీబీఐని ఉసిగొల్పాలో, ఎప్పుడు వెనక్కి పిలవాలో నిర్ణయిస్తున్నది కేంద్ర పాలకులని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో నిలబడిందంటే వారి చేతిలో సీబీఐ అనే అస్త్రమేనని ఆమె స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంత అధ్వానంగా, ఇంత నీచంగా ఆలోచిస్తుండడాన్ని మన దురదృష్టమనుకోవాలో ఇంకేమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు.

జగనన్నను రాజకీయంగా ఎదుర్కొలేక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యి సీబీఐతో కేసులు పెట్టించాయని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. వీరికి ధైర్యముంటే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన పదిహేనుమంది ఎమ్మెల్యేలనూ సస్పెండ్ చేసి ఎన్నికలు నిర్వహించగలరా అని సవాలు విసిరారు. వీరికంత ధైర్యం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా, ఉప ఎన్నికలు పెట్టినా ఆయా స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్న విషయం వారికి తెలుసన్నారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అందుకే పార్టీ గుర్తుపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెబుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ లేదా టీడీపీ మాత్రమే ఉండాలనీ, మూడో పార్టీ ఉండకూడదనీ వారు భావిస్తున్నారన్నారు. బోనులో ఉన్న సింహం సింహమేనని జగనన్నను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జగనన్నను ఏ శక్తీ నిలువరించలేదని పేర్కొన్నారు. ఆయన త్వరలోనే బయటకు వచ్చి మనందర్ని రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడని ఆమె స్పష్టంచేశారు. అదెంతో దూరంలో లేదనీ, సమయం వచ్చినప్పుడు ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కోటి ఎకరాలకు నీరందించాలన్న రాజన్న కలను జగనన్న నెరవేరుస్తాడని భరోసా ఇచ్చారు.

Back to Top