స్వాగతించిన జన సుమాలు

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి షర్మిలకు జగ్గయ్యపేట జనసుమాలతో స్వాగతం పలికింది. వీధులన్నీ జనప్రవాహంతో పోటెత్తాయి.. జోహార్ రాజన్న, జైజై జగనన్న నినాదాలు మిన్నంటాయి. ఆ జనసందోహం ముందు గళం విప్పిన జగనన్న విడిచిన బాణం 'ఈ చీకటి పాలనకు తెరపడుతుందని అభయమిస్తూ,  కుమ్మక్కు కుట్రల కుటిల నీతికి పరాజయం తప్పదని' హెచ్చరించారు.

జగ్గయ్యపేట 22 ఏప్రిల్ 2013:

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 127వ రోజు ఆదివారం వత్సవాయి మండలం మక్కపేట నుంచి చిల్లకల్లు, నియోజకవర్గ కేంద్రమైన జగ్గయ్యపేట, షేర్‌మహ్మద్‌పేట వరకు సాగింది. మక్కపేట నుంచి చిల్లకల్లు వరకు శ్రీమురళీకృష్ణ కోలాట సమాజం (పెనుగొలను) చిన్నారులు పాదయాత్ర ముందుభాగాన కోలాటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శనివారం నాటి వర్షానికి కల్లాల్లోనే తడిసిపోయిన మొక్కజొన్నను రైతులు ఆమెకు చూపించారు. గొర్రెల కాపరులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పరిటాల అర్జునరావు ఆవేదన చెందాడు. చిల్లకల్లు వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గద్దల ఆదాము, లాం డానియేల్ తదితరులు పాదయాత్రకు మద్దతు పలికి ఆమె వెంట నడిచారు. వడ్డెర సంఘం కోస్తా జిల్లాల అధ్యక్షుడు శివరాత్రి కోటేశ్వరరావు  తమ కులానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వినతిపత్రం అందించారు. వత్సవాయి మండలం గట్టుభీమవరం గ్రామస్తులు చిల్లకల్లు వచ్చి తమ ఊరికి మరోమారైనా రావాలని కోరగా, అలాగేనంటూ శ్రీమతి షర్మిల వారికి సమాధానమిచ్చారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తరలివచ్చిన యువకులు ఫీజు రీయింబర్సుమెంట్‌తో తమకు ఉన్నత విద్యావకాశాలు ఇచ్చిన దివంగత మహానేత మేలు మరువలేమంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నంకు చెందిన మహిళలు ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మను తెచ్చి శ్రీమతి షర్మిలకు అందించారు. చిల్లకల్లు ఎస్సీ కాలనీ, జగ్గయ్యపేట బైపాస్ రోడ్డు, కోదాడ రోడ్డులో ఉన్న వైయస్ విగ్రహాలకు శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యానగర్‌వాసులు ఏర్పాటు చేసుకున్న వైయస్ చిన్న విగ్రహాన్ని ఆమెకు అందించి ఆవిష్కరింపజేశారు. సభ ప్రాంగణంలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను వంద మంది మహిళలతో వచ్చి ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు.

చింతలు తీరలేదు

కృష్ణా జిల్లాలో సాగునీటి కష్టాలను తీర్చే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం మహానేత ఉంటే పూర్తయ్యేదని శ్రీమతి షర్మిల చెప్పడంతో సభికుల నుంచి విశేష స్పందన లభించింది. జగ్గయ్యపేట సభలో ఉపన్యాసం ప్రారంభంలోనే స్థానికంగా కీలకమైన పులిచింతల ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించారు. కిరణ్ సర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. జిల్లాలో 26 రోజులపాటు పాదయాత్ర నిర్వహించిన తనను ఆడపడుచుగా ఆశీర్వదించిన మీ ఆప్యాయతలను, అనురాగాన్ని మరిచిపోలేనని, చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నానని శ్రీమతి షర్మిల చెప్పారు. జగ్గయ్యపేట సభలో షర్మిల ఉపన్యాసం ముగింపు సమయంలో తన యాత్రలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ రాజన్న కూతురిగా, జగనన్న చెల్లెలిగా తనను ఆదరించి దీవించిన కృష్ణాజిల్లా ఆదరణను గుండె నిండా నింపుకొని వెడతానని తెలిపారు. సామినేని ఉదయభాను ఇచ్చిన శంఖాన్ని శ్రీమతి షర్మిల పూరించారు. రాజతలపాగా పెట్టిన షర్మిల కత్తి దూసి, విల్లంబులు ఎక్కుపెట్టారు. విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ గుర్రం బొమ్మను జ్ఞాపికగా శ్రీమతి షర్మిలకు అందించారు.

తాజా వీడియోలు

Back to Top