అసెంబ్లీలో ప్రభుత్వ అవినీతిని నిలదీస్తాం

కర్నూలుః
 వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో జరుగుతున్న
దోపిడీ, అవినీతి, అక్రమాలపై అసహనం వ్యక్తం చేశారు.  విచ్చలవిడిగా జిల్లాలో
దోపిడీ కార్యక్రమాలు నడుస్తున్నాయని, అవినీతి పరాకాష్టకు చేరిందని ఆగ్రహం
వ్యక్తం చేశారు. సహజ సంపదను దోచుకోవడమే గాకుండా ప్రజల మాన, ప్రాణాలతో
అధికార పార్టీ నేతలు చెలగాటమాడుతున్నారని ఫైరయ్యారు. అధికారులు, పాలకులు
యథేశ్చగా వందల లారీల ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తూ నిలువునా
దోచుకుంటున్నారన్నారు. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఇళ్లు కట్టుకోలేని
పరిస్థితి నెలకొందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ దందా
సాగుతుంటే అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలకు తొత్తులగా మారి  చూసిచూడనట్లు వ్యవహరిస్తే పరిణామాలు
తీవ్రంగా ఉంటాయన్నారు. 


ఇసుక
మాఫియా, మట్కా వ్యాపారం, హత్యా రాజకీయాలకు పాల్పడుతూ పాలనను
ఎటుతీసుకుపోతున్నారని మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుకను
కంట్రోల్ చేసి స్థానిక ప్రజలకు సరసమైన ధరలకు అందివ్వాలని డిమాండ్ చేశారు.
మద్యం సిండికేట్లు, మట్కా వ్యాపారాలు, జూదగృహాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
లేనిపక్షంలో ప్రజాఉద్యమాలు చేయాల్సివస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తామని మోహన్ రెడ్డి చెప్పారు. ఇక
జనచైతన్యయాత్రల పేరుతో టీడీపీ నేతలు భజన యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా
చేశారు. 
Back to Top