సమైక్యాంధ్ర అంటేనే అరెస్టు చేసేస్తారా?

చంద్రగిరి/ పూతలపట్టు (చిత్తూరు జిల్లా) :

సమైక్యాంధ్ర అని నినదించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం రాజకీయాల్లో దిగజారిన విలువలకు తార్కాణం అని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 30 లోక్‌సభా స్థానాలను తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో మనమే గెలుచుకుని ఢిల్లీ అహంకారానికి సరైన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శ్రీ జగన్‌ శుక్రవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

వైయస్ఆర్‌సీపీ శాసనసభా పక్ష నాయకురాలు శ్రీమతి విజయమ్మతో సహా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అహంకారపూరితంగా సభ నుంచి బహిష్కరించి, పోలీసు స్టేషన్‌కు తరలించిందని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. సభ నుంచి సస్పెండ్‌ చేసినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం దృఢంగా నిలబడ్డారని ఆయన తెలిపారు. విభజన ప్రక్రియ త్వరగా జరిగేందుకు కాంగ్రెస్, టీడీపీలు నిస్సిగ్గుగా కుమ్మక్కై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని సభలో లేకుండా చేసి ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చను ప్రారంభించాయని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన లాంటి అత్యంత ముఖ్యమైన అంశం అసెంబ్లీకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గాని సభలో కనిపించడంలేదని శ్రీ జగన్‌ తప్పుపట్టారు. పార్లమెంటరీ విధానాలను విరుద్ధంగా విభజన బిల్లుపై చర్చించడం కోసమే 70 శాతం ప్రజల అభిప్రాయాన్ని వినిపిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులను సభ నుంచి బయటికి గెంటివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని శ్రీ వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ ఒకపక్కన సోనియా గాంధీని పదేపదే ప్రశ్నిస్తున్న చంద్రబాబు మరో పక్కన విభజన ప్రక్రియలో ఆమెతోనే చేతులు కలిపారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఆవరణలో కేవలం తన చాంబర్‌లోనే కూర్చుని చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల టీడీపీ సభ్యులూ తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర‌ విభజనకు పరిహారంగా చంద్రబాబు నాయుడు ప్యాకేజ్‌లు అడుగుతున్నారని అన్నారు.

మన రాష్ట్రానికి ఎంతో దారుణమైన అన్యాయం జరుగుతోందని దేశం మొత్తానికి తెలిస్తే.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం అదేమీ అర్థం కావడంలేదని శ్రీ జగన్‌ ఎద్దేవా చేశారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రి పదవిలో కూర్చోబెట్టుకోవడం కోసం సోనియా గాంధీ మన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని దుయ్యబట్టారు. గడచిన 60 ఏళ్ళుగా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌లో సీమాంధ్రుల యువతీ యువకులకు ఉద్యోగాలు లేవంటూ తరిమేయడానికి సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సమైక్యాంధ్ర కోసం నిలబడి పోరాడుతున్నదెవరో, సమైక్యం ముసుగులో విభజనను ప్రోత్సహిస్తున్నదెవరో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ బాగా అర్థమైందని శ్రీ జగన్‌ అన్నారు. అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చలో పాల్గొంటున్న వారంతా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లే అన్నారు. విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నందు వల్లే శాసన సభ, మండలి నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులను బలవంతంగా బయటికి పంపించారని దుయ్యబట్టారు.

అన్యాయం దేశం అంతా చూసేలా చేయండి :

‘ఓట్లు, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఎలా దిగజారిపోతారో చెప్పడానికి మన రాష్ట్రమే ఒక ఉదాహరణ అన్నారు. సోనియా గీసిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇదేమిటని నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మనకే ద్రోహం చేస్తున్నారని శ్రీ జగన్‌ విమర్శించారు. మన రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని దేశం అంతా చూసేలా చేయండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ముసాయిదా బిల్లుపై చర్చించడం అంటే విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా అన్నారు.

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం :

రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఎన్ని కుమ్మక్కులు, ఎన్ని కుయుక్తులు చేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికల్లో ప్రజలందరం ఒక్కటవుదామన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం అన్నారు. కుమ్మక్కు రాజకీయాలను, ఢిల్లీ కోటను బద్ధలు కొడదామన్నారు. ఢిల్లీ కోటను మళ్ళీ మనమే పునర్నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు.

Back to Top