సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి

హైదరాబాద్ 01మార్చి 2013:

బాబ్లీ నిర్మాణ ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలని కేకే మహేందర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ చర్య చేపట్టాలని సూచించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జిట్టా బాలకృష్ణారెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకుని కేంద్రంపై ఈ అంశంలో ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. కొన్ని రాజకీయపార్టీలు బాబ్లీపై వారు చేసిన తప్పులను దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై నెట్టే యత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది 1995 సంవత్సరంలోననీ, ఆ సమయంలో పరిపాలన పరమైన అనుమతి లభించిందన్నారు. 1997లో బడ్జెట్ కేటాయింపు, 2001లో నమూనా తయారైంది. 2003 నాటికి టెండర్లను కూడా పిలిచారన్నారు. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగింది. కేంద్రంలో చక్రం తిప్పాననీ, నేనేం చెబితే అదే అవుతుందనీ చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ సమయంలో మొద్దు నిద్ర పో యారా అని మహేంద్ర రెడ్డి ప్రశ్నించారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు కళ్ళ నీరు పెట్టుకుంటున్నారనీ, ఏంచేసినా ప్రజలు వారిని నమ్మరనీ ఆయన స్పష్టంచేశారు. తెచ్చిపెట్టుకుని మరీ ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ కృష్ణా, గోదావరి డెల్టాలను కానీ దెబ్బ తీసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. వీటికి బాధ్యత వహించాల్సి కూడా ఆయనేనన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసమే చంద్రబాబు దివంగత మహానేతను విమర్శిస్తున్నారన్నారు.

     పూర్తికాని ప్రాజెక్టుల కోసం యాక్సలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ నుంచి 90 శాతం నిధులు ఇస్తుందనీ, అందుకే  దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం ఈ ఫండ్ నుంచి నిధులను కేటాయించుకుని ప్రాజెక్టులను పూర్తిచేసుకుందన్నారు. వ్యవసాయం దండగని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఈ నీళ్ళతో పండగ చేసుకోమని వారికి అర్పించారన్నారు. 2004లో బాబ్లీకి భూమి పూజ చేసిన అనంతరం అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మహానేత రాజశేఖరరెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. లేఖలకు స్పందన కరవైన తరవాత కోర్టులో కేసు వేశారన్నారు. అప్పటికే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరించబడిందన్నారు. మహానేతను విమర్శించడం ఎంతవరకూ సమంజసమని చంద్రబాబును నిలదీశారు. ఇది దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుందన్నారు. సమస్యలపై పోరాడడం మాని ఏడవడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలోని నాయకులు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వారి ప్రయోజనాలను కాపాడాలన్నారు.

Back to Top