హైదరాబాద్) న్యాయపోరాటంలో విజయం సాధించినందుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా మీద ప్రశంసలు కురిపించారు. వివిధ పట్టణాలు, నగరాల్లో మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరిపించారు.విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గంలో నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ తీశారు. సమన్వయ కర్త కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో మహిళా నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. అటు, నగర మహిళా విభాగం నేత్రత్వంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. అనంతపురంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, నగర మహిళ అధ్యక్షురాలు బిందెల శ్రీదేవి ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. మహిళా కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఒంగోలు లో ప్రకాశం జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు గంగడ సుజాత కార్యకర్తలతో ప్రదర్శన జరిపారు. అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రోజాకు సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లాలో మహిళా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశారు. రోజా సొంత నియోజక వర్గం నగరిలో విజయోత్సవ ర్యాలీ తీశారు. స్వీట్లు పంచుకొన్నారు. న్యాయపోరాటంలో గెలిచిన రోజా.. ఈ విజయాన్ని నియోజక వర్గ ప్రజలకు అంకితం ఇవ్వటం స్థానికులకు ఆనందాన్ని తెచ్చి పెట్టింది.