సుచరితకు మద్దతుగా ప్రచారం చేస్తాం

కేసీఆర్ మాటల గారడీని ప్రజలు నమ్మరు
వైఎస్ జగన్ దీక్షపై పొంగులేటి వ్యాఖ్యలు నిరాధారం
పొంగులేటి పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలి
భూప్రపంచం ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ ఉంటుందిః రాఘవరెడ్డి

హైదరాబాద్ః అధ్యక్షులు  వైఎస్ జగన్ దీక్షపై  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ  వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి మండిపడ్డారు.  వైఎస్ జగన్ దీక్ష చేయడం వల్లే పార్టీ మారుతున్నానని పొంగులేటి చెప్పడం సరికాదన్నారు. వ్యాపారాలు, డబ్బులు, స్వలాభం కోసం పార్టీ మారడం ఆయన ఇష్టమని...కానీ వైఎస్ జగన్ దీక్షను సాకుగా చూపి అవాకులు పేలడం మంచి పద్ధతి కాదన్నారు.  పొంగులేటి శ్రీ‌నివాస్‌ రెడ్డికి జన్మనిచ్చిన రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కొండా రాఘవరెడ్డి చెప్పారు. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల‌ల ప్రచారం చేయడం వల్లే ఆయన ఎంపీగా గెలుపొందార‌ని వివ‌రించారు. రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన పార్టీలో తెలంగాణ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వ‌డం చాలా త‌క్కువ మందికి అవకాశం లభిస్తుందన్నారు. 

తెలంగాణ‌లో రెండు జిల్లాలు, ఆంధ్ర‌లో నాలుగు జిల్లాల‌కు న‌ష్టం క‌లుగుతున్న‌టువంటి పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్య‌తిరేకంగా క‌ర్నూలులో దీక్ష చేపడుతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. ఆప్రాజెక్ట్ ల వల్ల ఆయా జిల్లాలు నాశనమవుతుంటే చూడలేకనే పెద్దమనసుతో వైఎస్ జగన్ దీక్షకు పూనుకున్నారని రాఘవరెడ్డి తెలిపారు.  మహానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రాజెక్టుల‌పై కేసీఆర్ అసెంబ్లీలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన‌ా...ఏనాడు పొంగులేటి ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి మ‌రో పార్టీలోకి వెళ్ల‌డం అనైతికమని, పార్టీ మారాల‌నుకున్న‌ప్పుడు గెలిపించిన పార్టీకి, ప‌ద‌వికి రాజీనామా చేసి వెళ్లాల‌ని డిమాండ్ చేశారు. వ్య‌క్తులు మారినంత మాత్ర‌నా పార్టీకి వ‌చ్చే నష్టమేమీ లేదన్నారు. 

సుచరితకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాం..
పాలేరులో రాంరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మ‌ర‌ణిస్తే ఆయ‌న భార్య‌కు కేటాయించాల్సిన ఎమ్మెల్యే ప‌ద‌వీకి సైతం పోటీ చేయ‌డం, అందుకోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీన్ని బ‌ట్టే టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీన‌త అర్థ‌మ‌వుతుంద‌న్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ క‌నుమరుగ‌వుతుంది అన్న అహంకారం మంచిది కాద‌ని, ప‌ద్థ‌తి మార్చుకోవాల‌ని ఆయ‌న హెచ్చరించారు. 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 52 సీట్లు ఇస్తే మీరు కేవ‌లం 26 సీట్లు మాత్ర‌మే గెలిచార‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాల‌న్నారు. 2009లో మ‌హాకూట‌మి పేర చంద్ర‌బాబుతో పొత్తుపెట్టుకున్పప్పుడు  టీఆర్ఎస్‌కు 52 సీట్లిస్తే కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే టీఆర్ఎస్ గెలిచింద‌న్నారు. ఎక్క‌డైనా ఏ పార్టీలోనైనా వ్య‌క్తులు మారితే పార్టీలు ఉండ‌వ‌నుకోవ‌డం త‌ప్పన్నారు. 

దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు 108, 104, ఆరోగ్య‌శ్రీ‌, ఫీజురీయంబ‌ర్స్‌మెంట్స్ వంటి ప‌థ‌కాల‌ను నీరుగార్చాల‌ని చూస్తే వైఎస్సార్‌సీపీ ఊరుకోబోదన్నారు.  కేసీఆర్ మాట‌ల గార‌డి ఆయిపోయింద‌ని ఇక‌పై ఆ మాట‌ల గార‌డిని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే పార్టీ బ‌లోపేతానికి మ‌రింతగా కృషిచేస్తామన్నారు.  2019లో ఒక బ‌లీయమైన శ‌క్తిగా ఎదుగుతామన్నారు.  పాలేరు కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్‌రెడ్డి భార్య సుచ‌రిత త‌ర‌ఫున త్వ‌ర‌లోనే వైఎస్సార్‌సీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తామ‌న్నారు. 

ఆ ఘనత వైఎస్సార్ దే..
భూ ప్ర‌పంచం ఉన్నంత వ‌ర‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉండ‌డ‌మే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌కు సైతం విస్త‌రిస్తుంద‌ని రాఘ‌వ‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనగానే గుర్తుకొచ్చేదీ ప్రాజెక్టులని కొండ రాఘ‌వ‌రెడ్డి అన్నారు. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 36 ప్రాజెక్టుల‌ను నిర్మాణంలో ఉంచిన ఘ‌న‌త ఒక్క రాజ‌శేఖ‌ర్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్సార్ తన హయాంలో తెలంగాణలో ఆరు ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి, ఆరు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీరందించార‌ని గుర్తు చేశారు. మిగతా 30 ప్రాజెక్టుల‌లో 21 ప్రాజెక్టులు పాక్షికంగా, 9 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయయని చెప్పారు. కానీ, ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్ట్ ల రీడిజైన్ పేర అత్తెసరు నిధులు విదిల్చి 47ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించే ప్రాజెక్టును తుంగలో తొక్కిందని విమర్శించారు
Back to Top