దగుల్భాజి ప్రభుత్వం

– అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ అసత్య ప్రచారం
– ప్రాజెక్టుల స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– 2013 భూసేకరణ చట్టం వద్దనడానికి కారణం చెప్పాలి
– మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ అండ 
– వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి

హైదరాబాద్ః అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.  కేసీఆర్‌ తనకు నచ్చినట్టు చట్టాలకు సవరణలు చేస్తూ గ్రామాలకు గ్రామాలు రైతులను ముంపులోకి నెట్టేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీర్‌ హనుమంతరావు మృతి పట్ల ఆయన కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

కేసీఆర్ 123 జీవో ఎందుకు తెచ్చారో ప్రజలకు తెలియజెప్పాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని కాదని 123 జీవో తీసుకురావడం వెనుక కారణం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడూ ఎంపీగా ఉన్న కేసీఆర్‌ 2013 చట్టంలో లోపాలుంటే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. జూన్‌, జూలై నెలల్లో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానని ప్రకటనలు గుప్పించే కేసీఆర్‌ ప్రాజెక్టులు పూర్తికాకుండా ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. తూతూ మంత్రంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే ఆరు నెలల్లో ఎలా పూర్తిచేస్తావో ప్రజలకు తెలియజెప్పాలన్నారు.

 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులందరికీ అలాంటి భూమిని మరోచోట ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును దివంగత మహానేత 1.5 టీఎంసీల కోసం నిర్మిస్తే అడ్డగోలు భూసేకరణతో 50 టీఎంసీలకు పెంచేసి బాధితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా 12 ప్రాజెక్టుల స్థితి గతులు పరిశీలిస్తే కేటాయింపులకు నిధుల విడుదలకు పొంతనలేదన్నారు. 88 ముంపు గ్రామాలకు గాను 75 గ్రామాల్లోనే సర్వే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 70వేల కోట్లు వ్యయం అయ్యే ప్రాజెక్టులకు అంచనాలు అడ్డగోలుగా పెంచేసి 2లక్షల 44 వేల కోట్లకు పెంచేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

దాదాపు 55 వేల కోట్లు వ్యయం పెంచేసి దోపిడీకి పన్నాగం వేశారని కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. మేనిఫెస్టోను భగవద్గీత అని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్‌ ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. పైగా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల సంగతి ఏంటో చెప్పాలన్నారు. కోదండరాం, జస్టిస్‌ చంద్రకుమార్‌ వంటి మేధావులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం చూస్తుంటేనే ముఖ్యమంత్రి సంగతి అర్థమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు నీళ్లు.. నిధులు.. నియామకాలు అని ఊదరగొట్టి ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆనాడు నీళ్లపై గొప్పగా పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చావుగా ఇప్పుడూ ప్రాజెక్టులపై ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దగుల్భాజీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు భూదాహం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top