చంద్రబాబా మజాకానా

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
బాబు పర్యటన కోసం పరీక్షలు వాయిదా
స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశాలు
పాఠశాల బస్సులను ప్రజలను తరలించేందుకు ఉపయోగిస్తున్న వైనం
ప్రభుత్వం, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

పశ్చిమగోదావరిః ముఖ్యమంత్రి తన పర్యటనలతో విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా విద్యాశాఖ అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి.. విద్యార్థులు ప్రయాణించే బస్సులను కూడా ప్రజల్ని తరలించేందుకు వినియోగిస్తున్నారు.  పరీక్షల సీజన్ కావడంతో ఈసారి మినహాయింపు వస్తుందని  పాఠశాలల యాజమాన్యాలు భావించాయి. ఐనా కూడా అధికారులు వదల్లేదు.  బాబు పర్యటన కోసం ఏకంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసి... ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఆదివారం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

వార్షిక పరీక్షల నిర్వహణను కూడా ఇష్టారాజ్యంగా మార్చిన వైనం వివాదాస్పదమవుతోంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి డివిజన్ల పరిధిలోని 11మండలాల్లో గల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులకు అప్పగించాలని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించాల్సిన పరీక్షలను ఆదివారం నిర్వహించాల్సిందిగా సూచించారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని అడిగిన ఓ విద్యాసంస్థ అధినేతపై విద్యాశాఖ అధికారులు కస్సుబుస్సులాడారు.  ‘పరీక్షలేగా తర్వాత పెట్టుకోండి. ముఖ్యమంత్రి పర్యటన కంటే ఎక్కువా’ అంటూ ఓ అధికారి ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేసింది. 

‘సీఎం పర్యటన అంటే ఎప్పుడూ మేమే బస్సులిస్తున్నాం. ఈసారైనా ఆర్టీసీ బస్సులను వాడుకోండి. అవసరమైతే డీజిల్ ఖర్చు మేమే భరిస్తాం’ అని ఓ విద్యాసంస్థల కరస్పాండెంట్ ముందుకొచ్చినా. అధికారులు పట్టించుకోలేదన్న వాదనలు ఉన్నాయి. కనీసం విద్యార్థుల భవిష్యత్‌ను కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఆదివారం నాడు పాఠశాలల నిర్వహణపై విమర్శలున్న పరిస్థితుల్లో ...వార్షిక పరీక్ష ఆదివారం  రాయించడం వివాదాస్పదమవుతోంది.
 
Back to Top