హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలోని మెట్ట ప్రాంత రైతులను ఆదుకునేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సౌకర్యం పొందాలంటే ఆధార్ కార్డు ఉండి తీరాలని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం షరతు విధించడం దారుణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 20వ తేదీలోపుగా ఆధార్ వివరాలు ఇవ్వకపోతే ఆ మరుసటి రోజు నుంచే ఉచిత విద్యుత్ ఉండదని చెప్పడం, గడువు కూడా పొడిగించకపోవడం ఏ మాత్రం సరికాదన్నారు.గురువారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం వల్ల మొత్తం 13.50 లక్షల విద్యుత్ కనెక్షన్లలో 40 శాతం మంది రైతులకు ఉచిత విద్యుత్ పథకం దక్కకుండా పోతుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు 'ఆధార్ కార్డుతో గ్యాస్ కనెక్షన్ లింకా.. సబ్సిడీ బియ్యం కోసం ఆధార్ కావాలా..?' అంటూ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక అదే ఆధార్ కార్డును ఆయుధంగా చేసుకుని సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని పద్మ దుయ్యబట్టారు.ఆధార్ పేరు చెప్పి రాష్ట్రంలో 10 లక్షల సామాజిక ఫింఛన్లు, 223 లక్షల రేషన్ కార్డులను కత్తిరించారని ఆమె పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ఆధార్ కార్డును ముడి పెట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం శోచనీయమన్నారు. వృద్ధులు, పేదలపై చంద్రబాబుకు పగ ఎందుకు? రైతులంటే కోపమెందుకు అని ఆమె ప్రశ్నించారు.అంతా మిథ్య అనుకుంటున్నారా?"నాడు ఆధార్ అంటే ఖబడ్దార్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిదానికీ ఆధార్ జపం చేస్తున్నారు.. ఉచిత విద్యుత్తుకు ఆధార్ కార్డుతో లింకు అంటున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి? పంట భూమి ఉండటం అబద్ధమా? రైతు అబద్ధమా? అంతా మిథ్య అనుకుంటున్నారా?" అని పద్మ ప్రశ్నించారు. వాస్తవానికి చంద్రబాబు మనసున్న ముఖ్యమంత్రి కానే కాదని, పది మందికీ సాధ్యమైనంత ఎక్కువ మేలు చేద్దామనే ఆలోచన కన్నా రూపాయి, రూపాయి ఎలా మిగుల్చుకుందామనే ఆలోచిస్తూ ఉంటారని ఆమె విమర్శించారు. ఉచిత విద్యుత్ పథకానికి ఆధార్ తప్పనిసరి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆమె హెచ్చరించారు.శ్రీ వైఎస్ జగన్ అంటే ఎందుకంత భయం?వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తరువాత కూడా మీడియా యాజమాన్యాల గుండెల్లో నిద్రపోతున్నారని, అందుకే వారికి శ్రీ వైఎస్ జగన్ అన్నా, వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అన్నా భయం అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఒకచోటి నుంచి మరొక చోటుకి మార్చుతున్న క్రమంలో వైఎస్ విగ్రహానికి అపచారం చేశామని ఒక ఛానల్, ఒక పత్రిక విషప్రచారానికి పూనుకున్నాయని, వైఎస్ జీవించి ఉండగా ఈ మీడియా యాజమాన్యం వైఎస్ పట్ల ఎంత బాగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని ఆమె అన్నారు. ఈ తరహా విషప్రచారం ద్వారా తమ పార్టీకీ వైఎస్ పట్ల గౌరవం లేనట్లు, వారికే ఉన్నట్లు వ్యవహరించడం విడ్డూరమన్నారు. ఎన్టీఆర్ బతికి ఉండగానే సమాధి చేయడానికి గోతులు తీసి తోసిన చేతుల్లో ఈ పత్రికా యజమాని చేయి కూడా ఉందనే విషయం మరువలేనిదని ఆమె విమర్శించారు.