స్థానిక రిజర్వేషన్లు 50% మించకూడదు

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం 60.5% రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం చేసిన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అందరికీ కలిపి 50%లోపే ఉండాలని స్పష్టం చేసింది. ఈ 50% రిజర్వేషన్లకు లోబడే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనాభాలో వెనుకబాటుతనాన్ని గుర్తించేం దుకు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించింది. అవసరమైన సమాచారాన్ని సేకరించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని విశ్లేషించిన తర్వాత బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. అంతేకాక రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం శాతాల వారీగా రిజర్వేషన్లు అంతిమంగా ఖరారు చేసిన తరువాత, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించి, మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్, న్యాయమూర్తి విలాస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం మంగవారం తీర్పు వెలువరించింది. గడువు ముగిసిన స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారులను నియమించడాన్ని ధర్మాసనం ఈ తీర్పులో సమర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పిటిషన్లు దాఖలైన ఏడాదికి హైకోర్టు తన తీర్పును వెలువరించడం విశేషం.

ఇవీ వ్యాజ్యాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మొత్తం 60.5% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ 8న జారీ చేసిన జీవో 128ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎం.వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన టి.వెంకటరమణారెడ్డి గత ఏడాది జూన్‌లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటితో పాటు పంచాయతీలు, మునిసిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమించడంపై, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంపై, అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ, ఉన్నతస్థానంలో ఉన్న బీసీలను బీసీల జాబితా నుంచి తొలగించేటట్లు ఆదేశాలివ్వాలంటూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటినీ చివరిగా విచారించిన జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం గత నెలలో తీర్పును వాయిదా వేసింది. ఎట్టకేలకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ఉమ్మడి తీర్పును వెలువరించారు.

ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కానే కాదు...

1994 నుంచి బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నామని, 2006 ఎన్నికలను సైతం ఇదే విధంగా నిర్వహించామని, అందువల్ల బీసీలకు ప్రస్తుతం 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రభుత్వ వాదనతో తాము ఎంతమాత్రం ఏకీభవించడం లేదని, అది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల కల్పనకు అవసరమైన నిదర్శనపూర్వకమైన గణాంకాలు (ఎంపెరికల్ డేటా) రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రచురితం కాని గణాంకాల ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపింది. రాజ్యాంగం నిర్దేశించిన విధానాలకు లోబడి రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది. ఎస్‌సీ, ఎస్‌టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన విధంగానే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని తెలిపింది.

అసాధారణ సందర్భాల్లోనే రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిన దానిని, ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పెంపునకు అన్వయించడం ఎంతమాత్రం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని అధికరణం 243డి(6) ప్రకారం ఆమోదయోగ్యమైన రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం గానీ, సమాచార సేకరణ గానీ చేయలేదని వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతం బీసీలకు కల్పిస్తున్న 34% రిజర్వేషన్లు 2001 జనాభా లెక్కల ప్రకారం కల్పించారు. 2011 లెక్కలను ఇంకా ప్రచురించలేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం కల్పించిన రిజర్వేషన్లు సమంజసమే అని కొద్దిసేపు అనుకున్నాం. అయితే రిజర్వేషన్లు 50 శాతం దాటడం ఆమోదయోగ్యమా..? అన్నది మా ముందున్న ప్రధాన ప్రశ్న. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన దానిని బట్టి చూస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానేకాదు.’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

క్రీమీలేయర్ మినహాయింపు వాదన సరికాదు..

విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లను, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఒకే గాటన కట్టడానికి వీల్లేదని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఉద్దేశాలు వేరని ధర్మాసనం తేల్చింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజకీయ వెనుకబాటుతనంగా చూడలేమని పేర్కొంది. రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయా..? తక్కువ ఉన్నాయా..? అన్న విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని ధర్మాసనం సూచించింది. ‘ప్రభుత్వం జారీ చేసిన జీవో 128 ప్రకారం బీసీలకు 34%, ఎస్‌సీ, ఎస్‌టీలకు 18.3%, 8.25% చొప్పున రిజర్వేషన్లు ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 60.55 శాతం అవుతాయి. ఎస్‌సీ, ఎస్‌టీల రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు రాజ్యాంగం ప్రకారం వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిందే. బీసీల విషయానికి వస్తే జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దానిని బట్టి వారికి కేవలం దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి.’ అని చెప్పింది.

రాజకీయ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించే విషయంలో బీసీల్లో క్రీమీలేయర్‌ను మినహాయించాలన్న కొందరు పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసిన తరువాత నిర్ణీత కాలవ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యతని తెలిపింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది కాబట్టి, స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించిందని, ఇందులో ఎటువంటి తప్పులేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.

Back to Top