'స్థానికం'తో కాంగ్రెస్‌, టిడిపిలకు శాశ్వత సమాధి

హైదరాబాద్, 9 జూన్‌ 2013:

స్థానిక సంస్థల ఎన్నికలను గత రెండేళ్ళుగా  జరగకుండా కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై అడ్డుకుంటున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ ఎన్నికలను ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేయించాయని విమర్శించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయని ఎద్దేవా చేసింది. ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చి, చివరికి పార్టీ రహితంగా నిర్వహించి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేయాలని అవి ప్రయత్నిస్తున్నాయని దుమ్మెత్తిపోసింది.

అయితే, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలకు సర్వ సన్నద్ధం చేయడానికి రెండు రోజుల పాటు సమాయత్త, సన్నాహక సమావే‌శాలు నిర్వహించినట్లు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ సమావేశాల అనంతరం ఆయన పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, కె.కె. మహేందర్ రెడ్డి, సీఈసీ సభ్యులు ఆది శ్రీనివాస్, రాజ్ సింగ్ ఠాకూర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుట్టా మధు, కౌశిక్ రెడ్డితో కలిసి ఆదివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 80 శాతం స్థానాలు కైవసం చేసుకునే దిశగా కృషిచేస్తామని చెప్పారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్నింటినీ కాంగ్రెస్‌, టిడిపిలు వేశాయని భూమన ఆరోపించారు. అన్ని రకాల కుటిల యత్నాలు చేశాయని విమర్శించారు. స్థానిక ఎన్నికలు పార్టీల పరంగా జరిగితే తమకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆ రెండు పార్టీలూ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పుడుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, టిడిపిల కుట్రలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బయటపెడుతుందన్నారు. ఎన్నికలు ఏ విధానంలో జరిగినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు ఒక్కటై పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా కృషి చేస్తామన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మోసాలను, ఆ రెండు పార్టీల్లోని గ్రూపు రాజకీయాలను స్థానిక ఎన్నికలు వేదికగా బట్టబయలు చేస్తామన్నారు. ప్రజలకు శత్రువుగా మారిన పాలకుల వైనాన్ని వివరిస్తామన్నారు.

అన్యాయంగా, అకారణంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌. టిడిపిలు జైలులో నిర్బంధించిన వైనాన్ని ఈ ఎన్నికల ద్వారా బహిర్గతం చేస్తామని భూమన చెప్పారు. ఈ ఎన్నికలను ముందస్తు రిహార్సల్‌ లాగా తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన స్పష్టంచేశారు.‌ తద్వారా కాంగ్రెస్, టిడిపిలకు శాశ్వతంగా సమాధి కడతామన్నారు. వైయస్‌ కుటుంబంపై టిడిపి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు చేస్తున్న అసత్య నేరారోపణలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు ప్రాంతాల్లోనూ ఆ రెండు పార్టీలను మట్టి కరిపిస్తామన్నారు.

ఈ క్రమంలో శ్రీమతి విజయమ్మ రాయలసీమ, నెల్లూరు జిల్లాల స్థాయి, మండల స్థాయి కో ఆర్డినేటర్లు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, పంచాయతీ కమిటీ సభ్యులందరితో ఈ నెల 14న తిరుపతిలో సమావేశం అవుతున్నారని భూమన తెలిపారు. ఈ నెల 16న విజయనగరంలోనూ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ కూడా శ్రీమతి విజయమ్మ ఇదే మాదిరి సమావేశాలు నిర్వహిస్తారన్నారు.

Back to Top