'స్థానికం'లో 34 శాతం బీసీ కోటా ఉండాల్సిందే

- విజయమ్మతో ఆర్‌. కృష్ణయ్య భేటి
- 26న బీసీ సమరభేరికి రావాలని ఆహ్వానం

హైదరాబాద్, ‌21 సెప్టెంబర్‌ 2012: స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతు(బీసీ)లకు 34 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆ‌ర్.కృష్ణయ్య కోరిన సందర్భంగా విజయమ్మ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయమ్మను హైదరాబా‌ద్‌లోని ఆమె నివాసంలో ఆర్‌. కృష్ణయ్య గురువారం కలుసుకున్నారు. బీసీ సమస్యలపై ఈనెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తాము నిర్వహించే ‘బీసీల సమరభేరి’ ధర్నాకు రావాలని ఆహ్వానించారు. అందుకు విజయమ్మ సానుకూలంగా స్పందించారు.

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉండాల్సిందేనని, ఈ విషయమై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి గతంలో కేంద్రానికి ప్రతిపాదన కూడా చేశారని ఈ సందర్భంగా విజయమ్మ గుర్తు చేశారు. ఆ మహానేత రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ బీసీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకే అసెంబ్లీకి వంద మంది బీసీ ఎమ్మెల్యేలను పంపించాలనే ప్రతిపాదనను చిత్తశుద్ధితో జగన్‌బాబు చేశారని విజయమ్మ చెప్పారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చేసిన ఈ ప్రతిపాదనలో చిత్తశు‌ద్ధి ఉందని, అన్ని రాజకీయపార్టీలు ఈ ప్రతిపాదనను అంగీకరించేలా ఒత్తిడి తీసుకొస్తామని కృష్ణయ్య చెప్పారు.

'బీసీలను అణగదొక్కేందుకు ‌ప్రభుత్వం కుట్ర':
రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు వీలు కల్పిస్తూ వైయస్ రాజశేఖరరెడ్డి అనేక చర్యలు తీసు‌కున్నారని కృష్ణయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం హైకోర్టు తీర్పును సాకుగా చూపించి బీసీలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని కృష్ణయ్య దుయ్యబట్టారు. విజయమ్మను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన వాదనలు చేయకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి దాపురించిందన్నారు.

మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించిన కేసులో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను రప్పించిన ప్రభుత్వం, బీసీల విషయంలో అలా ఎందుకు చేయలేదని కృష్ణయ్య నిలదీశారు.‌ బీసీలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ‌సరైన గుణపాఠం చెప్పాలన్న ఆలోచనతోనే ఈ నెల 26న ‘బీసీల సమరభేరి’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయమ్మతో భేటి అయిన వారిలో కృష్ణయ్యతో పాటు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బీసీ సె‌ల్ కన్వీన‌ర్ గట్టు రామచంద్రరావు, వివిధ బీసీ సం‌ఘాల నేతలు ఉన్నారు.
Back to Top