హోదా మన హక్కు..పోరాడి సాధించుకుందాం

()జైట్లీ ప్రకటనను స్వాగతించడం ఏపీ చరిత్రలోనే చీకటి రోజు
()ఓటుకు కోట్లు కేసునుంచి బయటపడేందుకు హోదా తాకట్టు
()కేంద్రంతో రాజీపడి ఐదుకోట్ల మందికి వెన్నుపోటు
()రాష్ట్రం నష్టపోతుందని తెలిసి కూడా కళ్లు మూసుకుంటున్నాడు
()వెంటనే రాజీనామా చేసి బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
()ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ డిమాండ్

అసెంబ్లీ(గాంధీవిగ్రహం): ఓటుకు కోట్లు కేసునుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్రంతో రాజీపడి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించడం ఏపీ చరిత్రలోనే చీకటి రోజని వైయస్ జగన్ అన్నారు.  చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కేంద్రంలోని మంత్రులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో బాబు ఏం అండర్ స్టాండింగ్ కుదుర్చుకున్నారో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రభుత్వతీరును నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  

తెలంగాణలో అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించగానే బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. దీంతో, ఈకేసు నుంచి తప్పించుకునేందుకు సుజనాచౌదిరితో అమిత్ షా నుంచి జైట్లీ వరకు బాబు మంతనాలు జరిపించారని, గవర్నర్ వద్దకు పంపారని దుయ్యబట్టారు. హోదాకు గవర్నర్ కు ఏంసబంధమని,  సుజనాచౌదరి గవర్నర్ ను కలవడం దేనికోసమని ప్రశ్నించారు. హోదాపై బాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. 

ఎంతదుర్మార్గమైన అబద్ధాలు ఆడుతున్నారంటే...ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కేవలం మన రాష్ట్రానికే ఇచ్చారని బాబు ప్రెస్ మీట్ లో చెప్పడం దారుణమన్నారు. తెలంగాణకు, ఏపీకి శనగాయకాయలు, బెల్లంలకు వేసినట్లు ఇస్తే మనకొక్కరికే వచ్చాయని బాబు చెప్పడం విడ్డూరమన్నారు. ఏమిటీ దారుణమని ప్రశ్నించేది పోయి బాబు దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు.  పక్కన తెలంగాణకు అవే ఇచ్చారన్న విషయాన్ని బాబు కప్పిపుచ్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు పద్ధతి ప్రకారం మోసం చేస్తూ హోదాను నీరుగారుస్తున్నాడని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. 

రాష్ట్రం నష్టపోతుంది. హోదాపై చర్చ జరపండి. తాము చెప్పేది వినండి అంటే...చంద్రబాబు స్టేట్ మెంట్ ఇస్తారని టీడీపీ నేతలు చెప్పడం అన్యాయమన్నారు. ఎన్నిసార్లు స్టేట్ మెంట్ ఇస్తారని అధికారపార్టీని ప్రశ్నించారు. బాబు స్టేట్ మెంట్ ఇవ్వడం..టీడీపీ నేతలు బల్లాలు చర్చడం ఓ తంతుగా మారిందని విమర్శించారు. రాష్ట్రం అన్యాయమైపోతుందని తెలిసి కూడా బాబు కళ్లు మూసుకుంటున్నారని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జైట్లీ ప్రకటన ఏపీకి ఎంత హానికరమో ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయలేని దుర్మార్గమైన స్థితిలో ఈప్రభుత్వం ఉండడం శోచనీయమని వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే అది హోదాతోనే సాధ్యమన్నారు. హోదా  ఉన్న రాష్ట్రాల్లో వచ్చిన బెనిఫిట్స్ అన్నీ ఏపీకి వస్తాయని...అప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి  క్యూ కడతారని చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలొస్తాయని తెలిపారు. 

బంద్ కాల్ కు పిలుపునిస్తే ఏపీఎస్ ఆర్టీసీకి బస్సులు బలవంతంగా తిప్పుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వేలమందిని అరెస్ట్ చేస్తున్నాడు. బంద్ విఫలమైతే హోదా మర్చిపోతారని అనుకుంటున్నాడు.  హోదా కోసం పోరాడాల్సిందిపోయి ఈవిధంగా దగ్గరుండి నీరుగారుస్తున్న వ్యక్తి సీఎంగా అర్హుడా అని వైయస్ జగన్  ప్రశ్నించారు . వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హోదా విషయంలో ప్రజలకు తోడుగా వైయస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. హోదా వచ్చేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని వైయస్ జగన్ తేల్చిచెప్పారు. 

ప్రత్యేకహోదా జగన్ ఒక్కడి వల్ల సాధ్యం కాదు.  ప్రతీ అక్క, అవ్వ, తాత అందరూ తోడుకావాలి. మీడియా సపోర్ట్ కావాలి. అందరం కలిసికట్టుగా పోరాటం కొనసాగిస్తూ పోవాలి. పోరాడకపోతే హోదాను పట్టించుకునే నాథుడే ఉండడు. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రత్యేకహోదా మన హక్కు. పార్లమెంట్ ను సాక్షి చేస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు హోదా చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇటువంటి హక్కును పోరాడకుండా వెనకడుగు వేసి పోగొట్టుకోవడం దారుణమవుతుంది. ఎప్పుడు వస్తుందన్నది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు హోదా ఇస్తామని చెబుతారో వాళ్లకే మద్దతిస్తామని చెప్పే పరిస్థితికి పోరాటం తీసుకుపోదాం. హోదా కోసం అందరూ భాగస్వాములు కావాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. 

Back to Top