రాష్ట్రానికి బలమైన నాయకుడు అవసరం

నీరుగుట్టవారిపాలెం (చిత్తూరు జిల్లా) :

ప్రజలకు మంచి జీవితాన్ని అందించడానికి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి బలమైన నాయకుడు ఉండి తీరాల్సిందే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర లక్ష్యాన్ని చేరాలంటే అందరం ఒక్కటిగా నిలబడి 30 లోక్‌సభా స్థానాలను గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శ్రీ జగన్‌ సోమవారంనాడు చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రస్తుత రాజకీయ నాయకుల తీరు చూస్తుంటే బాధగా ఉందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాధాన్యతలను  వారు తారుమారు చేశారని దుయ్యబట్టారు. ఏ ఒక్కరిలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న పట్టుదల గాని, మార్గం గాని లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకోవాలన్న ఆతృతలో సోనియా గాంధీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ఆదేశాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీని కాపాడే పనిని భుజాన వేసుకున్నారని చంద్రబాబు నాయుడు ఉన్నారని దుయ్యబట్టారు.

మరి కొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య నినాదంతో బరిలో దిగి 30 లోక్‌సభా స్థానాలు గెలుచుకుంటామని శ్రీ వైయస్‌ జగన్‌ ధీమాగా తెలిపారు. మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని హామీ ఇచ్చే వారినే ప్రధాని పదవికి నిర్ణయిస్తామని చెప్పారు. ఢిల్లీ అహంకారానికి- ఆంధ్రుల ఆత్మగౌరవానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని అభివర్ణించారు.

నిరుపేదలు, అవసరంలో ఉన్నవారి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగేళ్ళయినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. అయితే.. ప్రస్తుత రాజకీయ నాయకులలో ఆ మహానేతలో ఉన్నటువంటి భవిష్యత్‌ దృష్టి లోపించిందని ఆయన అన్నారు.

సీమ గడ్డ మీద పుట్టిన చంద్రబాబు తన పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారని, తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విభజించమని ప్లకార్డులు పట్టిస్తారని శ్రీ వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి దిక్కుమాలిన, నీతిమాలిన రాజకీయాలు చేయాలా? అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన పక్కనబెట్టి సోనియా గాంధీ గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రాంతాలను విడగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించుకోవాలన్న రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతోందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాలంటే ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలని, మనసు ఎరగాలన్నారు. మరణించిన తరువాత తన ఫొటో ప్రతి పేదవాని ఇంట్లో ఉండాలని ఆరాటపడటమే రాజకీయం అంటే అన్నారు. పేదరికాన్ని దగ్గర నుంచి చూసిన నాయకుడు మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది తాను మాత్రమే అని ఆయన గర్వంగా చెప్పారు. ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు పేదల బాధలు చూశానన్నారు.

ముఖ్యమంత్రి అయిన తరువాత తాను పెట్టబోయే రెండవ సంతకం గొప్ప సంతకం అని శ్రీ జగన్‌ తెలిపారు. ఆ గొప్ప సంతకం ‘అమ్మ ఒడి’ అనే పథకానికి శ్రీకారం చుడుతుందన్నారు. ఆ పథకం కింద ప్రతి తల్లి పిల్లలను బడికి పంపడమే అన్నారు. ఆ పిల్లాడిని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లో మేం చదివిస్తాం అని భరోసా ఇచ్చారు. తమ పిల్లాడిని బడికి పంపినందుకు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.500 చొప్పున, ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లల చొప్పున రూ.1,000 పడుతుందన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లను మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా‌మ్‌లు నిండిన తరువాత గాని కిందికి రాని పరిస్థితి ఉందని శ్రీ జగన్‌ తెలిపారు. మధ్యలో మరొక రాష్ట్రాన్ని తెస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? అని సోనియా గాంధీని, చంద్రబాబును, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నిలదీశారు.

జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులున్నారు.

రెండు కుటుంబాలకు జగన్ ఓదార్పు :
చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. సోమవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు నుంచి బయలుదేరిన శ్రీ జగన్ తట్టివారిపల్లెలో‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం  నీరుగట్టువారిపల్లె చేరుకున్నారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కంచుకొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఆయన ఓదార్చారు. అక్కడి నుంచి గంగపురం చేరుకునేసరికి రాత్రి పది గంటలు దాటింది. గంగపురంలో చెనిక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదార్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top