సింగపూర్ కంపెనీలకు రాష్ట్రం తాకట్టు

  • ‘స్విస్’ఛాలెంజ్ కాదు చంద్రన్న ఛాలెంజ్ 
  • రాష్ట్రాన్ని దోచుకునేందుకే స్విస్‌ ఛాలెంజ్‌ పద్దతి
  • ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు
  • రాష్ట్రాన్ని విదేశీయులకు దోచిపెడుతున్నారు
  • బాబుపై  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్‌: స్విస్‌ ఛాలెంజ్‌ విధానంతో చంద్రబాబు ఆంధ్రరాష్ట్రాన్ని సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. విదేశీ కంపెనీలకు 58 శాతం వాటాతో  వేల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.  స్విస్‌ ఛాలెంజ్ పేరుతో చంద్రబాబు ఏపీకి చేస్తున్న లూటీపై హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో  బుగ్గన మీడియాతో మాట్లాడారు. 

రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర పీఏసీ చైర్మన్‌గా స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. దీంట్లో అనేక ముఖ్యమైన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సింగపూర్‌ కంపెనీలతో కలిసి ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని బుగ్గన గణాంకసహింతగా వివరించారు. ఈ కమిటీలో నలుగురు సింగపూర్‌ ప్రతినిధులు ఉంటే ఇద్దరు మాత్రమే ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారని తెలిపారు. సింగపూర్‌ కంపెనీలు మూడు కలిసి ఒకగ్రూప్‌గా ఏర్పడి ప్రపోజల్‌ ఇస్తారు. వాళ్లకు 58 శాతం వాటా, ఏపీకి 42 శాతం వాటా కల్పిస్తారన్నారు.

రాజధానిలో ముఖ్యభాగ నిర్మాణానికి రూ. 3 వేల కోట్ల చిల్లర ఖర్చు అయితే వాటిలో రూ. 300 కోట్లు విదేశీ పెట్టుబడులు, రూ. 2 వందల కోట్లు ఏపీ ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సివస్తుందన్నారు. అంతేగాక రూ. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసి మిగిలిన 2 వేల కోట్ల బ్యాలెన్స్‌ నిధులు రాజధాని ప్రాంతంలో ప్లాట్ల్‌ వేసి అమ్మి ఖర్చు పెట్టనున్నారని వివరించారు. ప్లాట్ల రూపంలో వచ్చిన డబ్బుల్లో ఏపీ వాటా 42 శాతం ప్రకారం లాభాలన్ని ఖర్చు చేస్తే సింగపూర్‌ కంపెనీలు మాత్రం వచ్చిన లాభాల్లో కేవలం 7 వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రపోజల్‌లో ఉందన్నారు. ‘ఎర్నిపోకబుల్‌ పవర్‌ ఆఫ్‌ అథర్ని’ ప్రకారం ఏపీపై సర్వహక్కులను, అప్పులు చేసి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టుకునే రైట్స్‌ను కూడా ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీలకు కల్పిస్తుందన్నారు.

 అదే విధంగా రాజధాని నిర్మాణంలో అప్పు విషయంలో సింగపూర్‌ కంపెనీలకు ఎటువంటి బాధ్యత ఉండదని, అప్పుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇవ్వాలంటూ ప్రపోజల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. అంతేకాకుండా విదేశీ కంపెనీలు మేనేజ్‌మెంట్‌ కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా అమరావతిలో రియలెస్టేట్‌ వెంచర్‌ను వేస్తారని చెప్పారు. దీనిలో మొత్తం 5.5 శాతం టర్నోవర్‌పై ఫ్రీ, అది చాలక ఒకవేళ ఆ వెంచర్‌లో ఏదైనా భవనం నిర్మాణం చేపట్టి అద్దెకు ఇస్తే మళ్లీ దాంట్లో ఒకటిన్నర నెల రెంట్‌ ఆ కంపెనీకి ఇవ్వాల్సివస్తుందన్నారు. రియలెస్టేట్‌ ఏజెన్సీలు, బ్రోకర్‌లకంటే ఎక్కువ దోచుకునేందుకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 

ఏపీకి అప్పులు.. సింగపూర్‌కు లాభాలు
భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్‌ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందని బుగ్గన ధ్వజమెత్తారు.  సింగపూర్‌ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని చెప్పారు. మన ఒప్పందాలు చూసి మిగతా రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి తలెత్తిందన్నారు.  ప్రజలను గందరగోళారికి గురి చేస్తున్నారని వాపోయారు. అయినవారికి మేలు చేసేందుకు ఏ నుంచి జడ్‌ వరకు అన్ని అక్షరాలు వాడుకుని ఇష్టమొచ్చినట్టుగా సంస్థలు స్థాపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్‌ కంపెనీలు అల్లుళ్ల కంటే ఎక్కువై కూర్చుకున్నాయని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు, సింగపూర్‌కు లాభాలు అన్నరీతిలో ఈ ఒప్పందాలున్నాయన్నారు. సుమారు 16 వందల ఎకరాల చుట్టూ మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5,500 కోట్లు ఖర్చు చేయాలని, అదిగాక మట్టి, ఇసుక, రోడ్లు, విద్యుత్, నీళ్లు, గ్యాస్‌ కనెక్షన్‌లు కూడా చౌకధరలకే ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు సిద్ధపడిందన్నారు. రాజధాని నిర్మాణంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోని సింగపూర్‌కు ఎందుకు అప్పగించడం అని టీడీపీ సర్కార్‌ను బుగ్గన ప్రశ్నించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అమరావతి నిర్మాణం నిలిపివేస్తే పెట్టుబడులకు అదనంగా వడ్డీలు, చక్రవడ్డీలు సింగపూర్‌కు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టడానికి మన భారతీయులు లేరా అని చంద్రబాబును ప్రశ్నిస్తే,  మనవాళ్లు మురికివాడలకే పనికొస్తారంటూ చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 స్విస్‌ ఛాలెంజ్‌ విధానం పేరుతో చంద్రబాబు దుబాయ్, అబుదాబిలోని బిల్డింగ్‌లను కాపీ, పేస్ట్‌ చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గతంలో తరిమెల నాగిరెడ్డి ’తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకం రాశారని ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే ’అమ్మకానికి ఆంధ్రప్రదేశ్‌’ అని పేరు పెడతారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలా లేదని, చంద్రన్న ఛాలెంజ్, చంద్రన్న కానుకల్లా ఉందన్నారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానం ద్వారా రాష్ట్ర ఆస్తిని విదేశాలకు ధారాదత్తం చేసి దోపిడీకి గురి చేయడం తప్ప మరొకటి లేదన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top