రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీకి తాకట్టు

 • రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీ బాద్ షా పాదాల దగ్గర పెట్టిన బాబు
 • కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలం
 • రాష్ట్రంలో బీద అరుపులు అరుస్తూ..ఢిల్లీలో మోడీ పాద సేవ
 • కేంద్ర స్కీంలను ఏపీలో స్కాములుగా మార్చిన ఘనడు
 • బాబు మీ ఢిల్లీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయండి
 • ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించి గెలిపించే దమ్మూ, ధైర్యం ఉందా బాబు
 • బాబు-మోడీ జోడి దొందూ దొందేఃతమ్మినేని

 • హైదరాబాద్ః హైదరాబాద్ః చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఢిల్లీకి తాకట్టుపెడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తుంటే...చంద్రబాబు మొద్దు నిద్ర వహిస్తున్నారని దుయ్యబట్టారు. అందరినీ కలుపుకుని వెళ్లి కేంద్రాన్ని నిలదీసే కార్యక్రమం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.  ఏనాడైనా ఒక్క అఖిలపక్ష సమావేశాన్నైనా పెట్టారా బాబు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డబ్బులు లేవని బీద అరుపులు అరుస్తూ ...ఢిల్లీకి పోయి బాబు మోడీ పాద సేవ చేస్తున్నారని ఫైరయ్యారు. 

  రాష్ట్రాధికారాలు, రాష్ట్రాల స్వ‌యంప్రతిప‌త్తి, రాష్ట్రాల‌కు రావాల్సిన నిధుల కేటాయింపులో మ‌డ‌మ తిప్ప‌కుండా ఆనాడు ఎన్టీఆర్ పోరాడారని తమ్మినేని చెప్పారు. కానీ చంద్రబాబు తన సొంత ప్ర‌యోజ‌నాల‌ కోసం  రాష్ట్ర భ‌విష్య‌త్‌ను ఢిల్లీ బాద్‌షాల ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టిన నీచ నాయ‌కుడు  అని తమ్మినేని విమ‌ర్శించారు. ఇంత‌టి ద‌యానీయ‌మైన ప‌రిస్థితిని చూస్తుంటే ఈ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందోన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రం వ‌ద్ద ఎందుకు బిక్షం దేహి అని ఎందుకు అడుక్కుంటున్నారని బాబును ప్రశ్నించారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్ 16వేల కోట్లుంటే... కేవలం 3వేల కోట్లు విద‌ల్చితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని బాబు కేంద్రాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నిలదీశారు. 

  విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ ఎందుకు అడ‌గ‌డం లేద‌ని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో త‌న మంత్రుల‌ను అక్క‌డే గ‌బ్బిలాల్ల  వేలాడ‌మ‌ని బాబు ఎందుకు చెబుతున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కొంత‌మేర‌కేన‌ని,  రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు తమ  ఎవ‌రైనా స‌రే హక్కుల కోసం గొంతెత్తి పోరాడాల్సిన అవసరం  ఉంద‌న్నారు.  రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీద్దామని అఖిలపక్షాలతో కలిసి వెళ్లే ప్రయత్నం బాబు చేయకపోవడం దుర్మార్గమన్నారు. 

  పోలవరానికి 16 నుంచి 20 వేల కోట్ల వరకు అవసరముండగా కేవలం రూ. 100 కోట్లతో సరిపెట్టారని,  రాజధాని కట్టాల్సిన కేంద్రప్రభుత్వం చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి మొహాన కొట్టిపోయిందని ...వీటిపై చంద్రబాబు కేంద్రపెద్దలను ఎందుకు నీలదీయడం లేదని తమ్మినేని బాబును ఎండగట్టారు. వీటన్నంటిపై  వైఎస్సార్‌సీపీ గ‌ట్టిగా నిలదీస్తే సెంట్ర‌ల్ స్టేట్ బంధాన్ని విడ‌గొట్టాల‌నుకుంటున్నార‌ని టీడీపీ నేతలు  ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చెప్పారు. అధికార ప్ర‌భుత్వం ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా  ప్ర‌త్యేక హోదా కోసం, ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ పోరాడుతునే ఉంటుంద‌న్నారు. 

  ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ అంద‌ర్నీ క‌లిసిన‌ట్లు చెబుతున్న చంద్ర‌బాబు... ఎన్నిసార్లు ప్ర‌త్యేక విమానాల్లో వెళ్లారో, దానికి ఎంత ఖ‌ర్చు అయిందో, ఆయ‌న ప‌ర్య‌ట‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన మేలు ఏమిటో ఒక శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ. 2వేల కోట్లు ఇవ్వ‌మంటే ....సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి ఎందుకు రెండు వేల కోట్ల‌ని అంటున్నారని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేటాయించిన నిధులపై బాబు సిటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేద‌ని, ఆంధ్ర‌కు ఇచ్చిన నిధుల‌న్నీ ప‌క్క‌దారికి వెళ్తున్నాయ‌ని, కేవ‌లం రూ. 900 కోట్లు చాల‌ని స్వయంగా ప్రధానే చెప్పారన్నారు. 
   
  ఎన్ఆర్ఈజీఎస్ ప‌థ‌కం పేద‌వారికి వంద రోజులు ఉపాధి క‌ల్పించే మంచి ప‌థ‌క‌మ‌ని, దాన్ని సైతం టీడీపీ ప‌క్క‌దారి ప‌ట్టించి ఆ నిధుల‌ను జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు దోచిపెడుతుందని తమ్మినేని నిప్పులు చెరిగారు. నీరు - చెట్టు అని కొత్త‌కొత్త స్కీంలు ఏర్పాటు చేయ‌డంలో త‌ప్పులేద‌ని, కానీ స్కాంలు మాత్రం త‌గ్గించాల‌ని ప్రభుత్వానికి చురక అంటించారు. స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ నిధుల‌ను సైతం పక్క‌దారి ప‌ట్టించి న్యాయ‌బ‌ద్ధంగా  పంచాయ‌తీల‌కు అందాల్సిన నిధుల‌ను కూడా టీడీపీ దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు. 

  కేంద్రం నుంచి వ‌స్తున్న స్కీంల‌ను బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కాంలుగా మారుస్తున్నందునే ప్రధాని రాష్ట్రానికి నిధులు ఇవ్వ‌డం లేద‌న్నారు. విభ‌జ‌న జ‌రిగి రెండేళ్ల‌యినా, రెండుసార్లు బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగినా...న్యాయబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడం దారుణమన్నారు.   ఐనా కూడా బాబు  కేంద్ర ప్ర‌భుత్వానికి చెక్క‌భ‌జ‌న చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని ఆదుకోమ‌ని మోడీకి లేఖ‌లు రాయ‌డ‌మే త‌ప్ప బాబు డిమాండ్ చేయ‌డం లేద‌న్నారు. 

  ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిలో ఉండే అధికారాలు, హక్కులు , సెక్ష‌న్ 8 , ప్ర‌త్యేక పోలీస్ గురించి మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి బాబు.  హైద‌రాబాద్‌ ఖాళీ చేయ‌మ‌ని మీ వెంట ఎవ‌రైనా ప‌డ్డారా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హెరిటేజ్ వ్యాపారం చేస్తావ్, కోట్ల రూపాయ‌లు వెచ్చించి సొంతిళ్లు కొనుక్కుంటావ్,  ప్ర‌జ‌ల డ‌బ్బుతో మ‌దీనాగూడ‌లోని ఫాంహౌజ్‌ను బాగు చేయించుకుంటావ్ ...కానీ  పాల‌న మాత్రం హైద‌రాబాద్ నుంచి జ‌ర‌గ‌కుడ‌దంటే ఎలా బాబు అని చురక అంటించారు. సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగులు ఉన్న ఫ‌లంగా అర్థ‌రాత్రి విజ‌య‌వాడ ర‌మ్మంటే ఎలా అని, ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌స‌తులు ఏర్పాటు చేసి వారిని ర‌మ్మ‌న్నాల‌ని బాబుకు హితవు పలికారు.

  మోదీ - బాబు జోడీ దొందు దొందేన‌ని ప్రలకు అర్థమైపోయిందన్నారు. చంద్రబాబును బీజేపీ ఎందుకు నమ్మడం లేదో చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. అధికారాన్ని పంచుకుంటున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అస‌లు ఎవ‌రిపై ఎవ‌రికీ న‌మ్మకం లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌ేందుకే బాబు కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌డం లేద‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియోలు తనవికావని చెప్పే దమ్ము బాబుకు లేదన్నారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే తాను చర్చకు వస్తానని, లేకపోతే  వైఎస్సార్‌సీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తా చంద్ర‌బాబు రావాల‌ని సవాల్ విసిరారు. 

  తెలంగాణ ఏసీబీ నివేదిక‌లో 22సార్లు చంద్ర‌బాబు పేరును ప్ర‌స్తావించార‌ని తమ్మినేని చెప్పారు. చంద్ర‌బాబుది వాడుకొని వ‌దిలేసే ప‌ద్ధ‌తి అని ఎన్నిక‌ల‌కు ముందు కొంద‌రికే తెలుస‌ునని, ప్ర‌స్తుతం అంద‌రికీ తెలుసిందన్నారు. రాజ‌ధాని టెండ‌ర్ల ద‌శ నుంచే ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో వైఎస్ జ‌గ‌న్‌కు ద‌మ్ముందా , మ‌గ‌త‌నం ఉందా, నువ్వు రాయ‌ల‌సీమ వాడివేనా అని  మాట్లాడిన చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడును సూటిగా ప్రశ్నిస్తున్నా.  పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి ... ప్ర‌జ‌ల్లోకి వెళ్లి గెలిపించే ద‌మ్ము ధైర్యం, ఉందా అని వారికి స‌వాల్ విసిరారు.  వైఎస్ జ‌గ‌న్ మ‌గాడు కాబ‌ట్టే గ‌తంలో ఇత‌ర పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వ‌చ్చిన వారితో రాజీనామా చేయించి గెలిపించుకొని తిరిగి శాస‌న‌స‌భ‌లో కూర్చోబెట్టార‌ని అది మ‌గ‌త‌నం అని చెప్పారు. అచ్చెన్నాయుడుకు ద‌మ్ముంటే ర‌మ‌ణ‌తో రాజీనామా చేయించి గెలిపించి చూపించాల‌ని ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ పోరాడలేదోమోగానీ వైఎస్సార్‌సీపీ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. 


Back to Top