సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తిని మరచిపోవద్దు: మేకపాటి

నెల్లూరు, 12 ఆగస్టు 2013:

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే దేశం ముక్కలు చెక్కలవుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ నిరుద్యోగుల వల్లే రాష్ట్ర విభజన సమస్య వచ్చిపడిందని రాజమోహన్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఎ.పి. ఎన్జీవోలు నెల్లూరు కలెక్టరేట్‌ ముందు చేస్తున్న ధర్నా, నిరసన కార్యక్రమానికి మేకపాటి సంఘీభావం ప్రకటించారు. ఐదు వందలకు పైగా సంస్థానాలను విలీనం చేసి, అఖండ భారతావనిని ఏర్పాటు చేసిన సర్దార్‌ వల్లబ్‌ భాయ్‌ పటేల్ స్ఫూర్తిని మరచిపోవద్దని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొందరు నాయకులు రాజీనామా డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మేకపాటి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ రాజధానిని వదులుకోవాల్సి వస్తుందని సీమాంధ్రులు అందరూ విచారిస్తున్నారని అన్నారు. తమ సర్వస్వం కోల్పోయిన మాదిరిగా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులంతా తమ భద్రత విషయంలో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని మేకపాటి తెలిపారు.

సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటూ కేసీఆర్‌ చెప్పడాన్ని మేకపాటి తప్పుపట్టారు. సీమాంధ్రులు వెళ్ళిపోవాని కేసీఆర్‌ సామరస్యంగా కాకుండా నియంత ఆదేశించినట్లు మీరు వెళ్ళిపోవాలి, నో ఆప్షన్‌ అంటున్నారని విమర్శించారు.

Back to Top