రాష్ట్ర ప్రయోజానాలు తాకట్టు

విభజన హామీలను గాలికొదిలేశారు
టీడీపీ, బీజేపీలను ప్రజలు క్షమించరు
అబద్ధాలు చెప్పి బాబు పబ్బం గడుపుకుంటున్నారు
అమర్నాథ్ దీక్షకు ఉమ్మారెడ్డి మద్దతు
 రైల్వే జోన్ కోసం ఐక్యంగా పోరాడుదామని పిలుపు

విశాఖపట్నంః స్వార్థ రాజకీయాల కోసం టీడీపీ నాయకత్వం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టుపెడుతోందని శాసనమండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.  విశాఖ రైల్వే జోన్ దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష అని ఉమ్మారెడ్డి తెలిపారు.  విశాఖకు ఆరు నెలల్లో రైల్వే జోన్ ఇస్తామంటూ రాజకీయ పార్టీలు పార్లమెంట్ సాక్షిగా వాగ్దానం చేశాయని, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాయన్నారు. రాష్ట్రవిభజన చట్టంలో కూడా పొందుపర్చారని ఉమ్మారెడ్డి వివరించారు. 

విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా జిల్లా అధ్యక్షుడు చెేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్నాయని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ అంశం చట్టబద్ధత ఉన్నది కాబట్టే ఇది మాహక్కు అని ప్రజలు అడుగుతున్నారని ఉమ్మారెడ్డి చెప్పారు. చట్టాన్ని అగౌరవపర్చడం...బిఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఉమ్మారెడ్డి తూర్పారబట్టారు. ప్రజలు క్షమించరని, రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతారన్నారు. 

విభజన చట్టంలోని హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని ఉమ్మారెడ్డి అన్నారు.  మిగతా పార్టీలు వ్యతిరేకించే అవకాశం లేకున్నా, పూర్తి మెజారిటీ ఉన్నా కూడా బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీలే అధికారంలో ఉన్నాయని...ఇరు పార్టీలకు చెందిన మంత్రులు కేంద్రప్రభుత్వంలో కొనసాగుతున్నారని ఉమ్మారెడ్డి చెప్పారు.  కేంద్రంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. 

చట్టం చేసిన తర్వాత కమిటీ వేశామని చెప్పడం హాస్యాస్పదమని ఉమ్మారెడ్డి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపారు. అలా చెప్పడం వినడానికే   సిగ్గుగా ఉందన్నారు. 2003లో 9 రైల్వే జోన్ లు ఇచ్చినప్పుడు, అంతకుముందు రైల్వే జోన్ లు ప్రకటించినప్పుడు  ఏ కమిటీలు వేసి ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందే తప్ప ఏ కమిటీలు వేయలేదని చెప్పారు. వాల్తేర్ రైల్వే జోన్ డివిజన్ కొత్తగా ఇచ్చేదేమీ కాదని అన్నారు.  

టీడీపీ నాయకత్వం  అది సాధించాం ఇది సాధించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర హక్కులను సాధించుకోవడం చేతగాకపోతే ....అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి చురక అంటించారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిని రాజకీయంగా  గాకుండా రాష్ట్ర ప్రయోజనాలుగా చూడాలని హితవు పలికారు. గతంలో ప్రత్యేక హోదా కోసం తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేశారని,  గుంటూరులో ఆమరణదీక్ష కూడా చేపట్టారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. ఐనా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.  

రైల్వే జోన్ ఢిల్లీ నుంచి విశాఖకు చేరేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందని కేంద్రమంత్రులు చెప్పడం హేయనీయమన్నారు.  రెండేళ్లనుంచి చెబుతూనే ఉన్నారని...ఇంకెన్నేళ్లు పడుతుందని నిలదీశారు. ప్రత్యేక హోదా గాలికి కొట్టుకుపోయింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. సమస్యను ఆలస్యం చేసేందుకు కమిటీలు వేస్తున్నారు తప్ప ఇంకోటి లేదని దుయ్యబట్టారు.  

బిహార్ ఎన్నికల సమయంలో లక్షా 65 వేల కోట్లు ప్రకటించారు.  తమిళనాడుకు 50 వేల కోట్లు ఉదారంగా ఇచ్చారు. కశ్మీర్ కు వేల కోట్లు వాగ్దానం చేశారు. ఏపీ విషయానికి వచ్చే సరికి మొండిచేయి చూపుతున్నారు. ప్రత్యేక హోదా ఊసేలేదు.  పోలవరానికి డబ్బులు లేవు. రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు.  నిధులిచ్చామని కేంద్రం చెబుతుంటే..ఇవ్వలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.  ఇచ్చిన డబ్బులకు లెక్కలు చూపెట్టమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతోంది. తాను కూడా  కేంద్రంలో మంత్రులుగా చేశానని, ఇంతకంటే రాష్ట్రానికి అవమానకరమైన దుస్థితి ఎప్పుడూ లేదని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

850 కోట్లు హైకోర్టు నిర్మాణానికి నిధులు పంపిచామని కేంద్రం చెబుతోంది. హైకోర్టుకు ఖర్చుపెట్టామని టీడీపీ రిపోర్ట్ పంపించింది. హైకోర్టు ఎక్కడ కట్టారు.  అసెంబ్లీకి ఖర్చుచేశామన్నారు. ఎక్కడ చేశారు. కట్టడాలు మొదలుకాకుండానే కట్టామని ఖర్చులు చూపిస్తున్నారు.  పోలవరం డబ్బులు పట్టిసీమకు పెట్టి వట్టిసీమగా మార్చారు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఓ ఆశయం కోసం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్న అమర్నాథ్ కు యువత మద్దతుగా నిలవాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్న విధంగా రైల్వే జోన్ సాధించుకోవడంలో ఉత్తరాంధ్ర యువత మేల్కోవాలన్నారు. వెనకడుగు వేయకుండా ఐక్యంగా అమర్నాథ్ దీక్షకు మద్దతిచ్చి ముందుకు సాగాలన్నారు. పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ కూడా అమర్నాథ్ దీక్షకు సంఘీభావంగా త్వరలో ఇక్కడకు వస్తారని చెప్పారు.  టీడీపీ, బీజేపీ లు తప్ప అంతా  అమర్నాథ్ పోరాటానికి మద్దతుగా నిలిచారన్నారు. రాజకీయాల కోసం చూడకుండా టీడీపీ, బీజేపీ నేతలు కూడా కదిలిరావాలన్నారు. ఎలాగూ మీఅంతట మీరు ఉద్యమం చేయలేరు గనుక చేసేవాళ్లకు మద్దతుగా నిలిస్తే బాగుంటుందని సూచించారు. 
Back to Top