చంద్రబాబు నోట సమైక్యం మాట రాదేం?

శాంతిపురం (చిత్తూరుజిల్లా),

1 డిసెంబర్ 2013: సమైక్యం అన్న ఒక్క మాట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటి నుంచి ఎందుకు రావడం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలుగు భాష రానివారు ఒక్కటిగా కలిసి ఉన్న తెలుగు ప్రజలను అన్యాయంగా చీలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో శ్రీ జగన్‌ ఆదివారం మధ్యాహ్నం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏం పాపం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను ‌ఆయన ఈ సందర్బంగా తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

ఢిల్లీ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర విభజనను ఒప్పుకోం అని ఢిల్లీకి వినపడేలా రెండు చేతులూ పైకెత్తి మరీ నినదించి చెప్పాలని సభకు హాజరైన ప్రజలకు శ్రీ జగన్‌ కోరారు. మన ఆత్మగౌరవం ఎలా ఉంటుందో ఢిల్లీ పెద్దలకు రుచి చూపిద్దామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో కోటను మనమే నిర్మిద్దాం. తెలుగువాడి ఆత్మగౌరవం ఎలా ఉంటుందో.. తెలుగువాడు కళ్ళెర్రజేస్తే.. ఢిల్లీ కోటలు ఎలా పగిలిపోతాయో ఒక్కసారి చూపిద్దాం అంటూ శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు. మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వారినే ప్రధాని పీఠంపై కూర్చోబెడదామన్నారు.

తాను కొన్ని ప్రశ్నలు వేస్తానని, వాటికి ఢిల్లీ వాళ్ళ చెవులు.. మోసం చేస్తున్న చంద్రబాబు, కిరణ్‌ చెవులు కూడా అదిరేలా సమాధానం చెప్పాలని శ్రీ జగన్‌ కోరారు. రాష్ట్రాన్ని వాళ్ళు విభజిస్తామంటే మనం ఒప్పుకుంటామా? అని ప్రశ్నించి ఢిల్లీ వాళ్ళకు అర్థమయ్యేలా ఇంగ్లీషులో 'నో' అని గట్టిగా చెప్పాలన్నారు. తెలుగుజాతి వాళ్ళు విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.. మనం ఒప్పుకుంటామా? అని ప్రశ్నించి.. 'నో' అని సమాధానం రాబట్టారు. నీటి కోసం అన్నదమ్ములమైన మనం కొట్టుకోవాలా? అని అడిగారు. హైదరాబాద్ నగరం మనందరిది. ‌హైదరాబాద్ నగరం కోసం మనందనం తన్నుకుని చావాలా అని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాగాంధీని, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డిలను మనం క్షమిస్తామా? అని 'నో' అని ప్రజల నుంచి రాబట్టారు.

ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పిల్లలు పరితపిస్తున్నా బాబు, కిరణ్‌ పట్టించుకోరని శ్రీ జగన్‌ విమర్శించారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని, సమైక్యానికి మద్దతుగా లేఖ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మహారాష్ట్ర అవసరాలు తీరితేనే గాని, కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే గాని కృష్ణానది నీటిని మన రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే వదలడం లేదని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. ట్రిబ్యునళ్ళు, బోర్డులు ఉండగానే, రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పటికీ పై రాష్ట్రాల అవసరాలు తీరితేనే గాని ఒక్క చుక్క నీటిని కిందికి వదలడంలేదన్నారు. మధ్యలో మరొక రాష్ట్రం వస్తే.. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచినీళ్ళెక్కడ ఉన్నాయని ప్యాకేజిలడుగుతున్న చంద్రబాబు నాయుడిని, విభజనకు సహకరిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న సోనియాగాంధీని ఆయన నిలదీశారు. చంద్రబాబు, కిరణ్‌రెడ్డి ఒకరిని మించి మరొకరు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఈ డ్రామాలు ఇంకా ఎన్ని రోజులని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీకి పంపించి మరీ కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు కావాల్సిన సమాచారాన్ని అందించి, సోనియాకు సహకరిస్తున్నారని శ్రీ జగన్‌ అన్నారు. అసెంబ్లీని సమావేశ పరిచి సమైక్యానికి అనుకూలంగా తీర్మానం పంపిద్దామని ప్రాధేయపడినా కిరణ్‌ పట్టించుకోలేదన్నారు. ఎన్నాళ్ళు బ్రతికామని కాదని, ఎలా బ్రతికామన్నదే ముఖ్యమని బాబు, కిరణ్‌లకు శ్రీ జగన్‌ హితవు పలికారు. కార్యకర్తలు తలెత్తుకుని చెప్పుకునేలా నాయకులు వ్యవహరించాలన్నారు. అయితే.. బాబు, కిరణ్‌లను చూస్తే.. వీళ్ళా మన నాయకులని చెప్పుకోవడానకే సిగ్గుగా ఉందన్నారు.

ఇప్పటికైనా వీళ్ళల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం అని శ్రీ జగన్‌ ఆకాంక్షించారు. చదువుకున్న మన పిల్లలకు వాళ్ళు తోడుగా ఉంటారని ఆశిద్దాం అన్నారు. మన రైతన్నకు ఇప్పటికైనా అండగా నిలుస్తారనుకుందాం అన్నారు. చెడిపోయి రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మనందరం కలిసికట్టుగా ఒక్కటై గెలుచుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం అని హెచ్చరించారు.

జై సమైక్యాంధ్ర, జై తెలుగుతల్లి, జై వైయస్ఆర్‌ అంటూ సభకు హాజరైన వారిచేత బిగ్గరగా నినాదాలు చేయించారు. ఆంధ్రప్రదే‌శ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ శ్రీ వైయస్‌ జగన్‌ సమైక్య శంఖారావం పేరిట యాత్రను శనివారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.

Back to Top